
బగళాముఖి దీక్షలు ప్రారంభం
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలోని బగళాముఖి అమ్మవారి ఆలయంలో భక్తులు శుక్రవారం అమ్మవారి మాలధారణ చేశారు. ఈ సందర్భంగా ఈవో నరసింహమూర్తి మాట్లాడుతూ శ్రావణమాసంలో అమ్మవారి భక్తులు బగళాముఖి దీక్ష తీసుకుని నియమ నిష్ఠలతో పూజలు నిర్వహిస్తారని తెలిపారు. శ్రావణమాసం ప్రారంభం రోజున అమ్మవారి ఆలయంలో 11మంది భక్తులు దీక్ష చేపట్టారు. దీక్ష తీసుకునే భక్తులకు మాలలు, దుస్తులు ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. శుక్రవారం సందర్భంగా బగళాముఖి అమ్మవారికి విశేష అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు.
అంగన్‌వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు
బాపట్ల: ఐసీడీఎస్‌లోని అంగన్‌వాడీల ఉద్యోగాలకు జిల్లా జేసీ జి.గంగాధర్‌గౌడ్ అధ్యక్షతన శుక్రవారం స్థానిక కలెక్టరే ట్‌లో ఇంటర్వ్యూలు జరిగాయి. నాలుగు కార్యకర్తల పోస్టులకు 12 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అలాగే 49 ఆయా పోస్టులకు ఇంటర్వ్యూలు జరగ్గా 95 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మహిళ శిశు సంక్షేమ శాఖ పీడీ రాధామాధవి, సీడీపీఓలు పాల్గొన్నారు.
బోల్తాపడిన క్యాబేజీ లారీ
మేదరమెట్ల: బెంగళూరు నుంచి విజయవాడకు క్యాబేజీ లోడుతో వెళుతున్న ఐషర్ లారీ బోల్తాపడిన సంఘటన కొరిశపాడు మండలం మేదరమెట్ల తమ్మవరం బ్రిడ్జిపై శుక్రవారం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో లారీ ఫ్లైఓవర్ బ్రిడ్జిపైకి వచ్చి డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తాపడింది. డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పారిపోగా కేసు నమోదు చేసినట్లు మేదరమెట్ల పోలీసులు తెలిపారు.
ముగ్గురి ప్రాణాలు
కాపాడిన డ్రోన్
చీరాల: చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో శుక్రవారం ముగ్గురు యువకులు అలల తాకిడికి కొట్టుకుపోగా రూరల్ ఎస్సై చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది, గజ ఈతగాళ్లను అప్రమత్తం చేసి ప్రాణాలు కాపాడారు. మార్టూరు మండలం కోలలపూడి గ్రామంలో అంకాలమ్మ తల్లి కొలుపుల సందర్భంగా గ్రామానికి చెందిన వెయ్యి మంది సముద్ర స్నానాలు చేసేందుకు వచ్చారు. వారిలో ముగ్గురు యువకులు సముద్రంలో ఎక్కువ లోతుకు వెళ్లి అలల తాకిడికి కొట్టుకుపోయారు. డ్రోన్ సహాయంతో యువకులను గుర్తించిన రూరల్ ఎస్సై చంద్రశేఖర్ వెంటనే విధుల్లో ఉన్న పోలీసులు, గజ ఈతగాళ్లను అప్రమత్తం చేశారు. స్పందించిన వారు నీటిలో కొట్టుకుపోతున్న ముగ్గురినీ కాపాడారు. ఎస్సై చంద్రశేఖర్ యువకులకు కౌన్సెలింగ్ నిర్వహించి వారితో పాటు వచ్చిన గ్రామస్తులకు క్షేమంగా అప్పగించారు.
విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ
సంతమాగులూరు(అద్దంకి): కొమ్మాలపాడు మక్కెనవారిపాలెం గ్రామాల్లోని 453 మంది విద్యార్థులకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం సైకిళ్లు పంపిణీ చేశారు. 46 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందించారు. అదే విధంగా మక్కెనవారిపాలెం గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించిన సీసీ రహదారులు, సీసీ డ్రైన్లను ప్రారంభించారు. ఆ తరువాత సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

బగళాముఖి దీక్షలు ప్రారంభం

బగళాముఖి దీక్షలు ప్రారంభం

బగళాముఖి దీక్షలు ప్రారంభం