
బర్లీ రైతుకు బాబు వెన్నుపోటు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: రైతుల అనుమానమే నిజమైంది. రైతులు పండించిన మొత్తం పొగాకు కొనుగోలు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మాటమార్చి ఒక్కొక్క రైతు నుంచి 20 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని మంత్రివర్గం తీర్మానం చేయడంపై పొగాకు రైతులు మండిపడుతున్నారు. ఇందులో టీడీపీకి చెందిన రైతులు కూడా ఉండడం గమనార్హం.
మాట మార్చిన ప్రభుత్వం
రైతులు పండించిన మొత్తం బ్లాక్ బర్లీ పొగాకు కొంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం మాటమార్చింది. ఇప్పడు ఒక్కొక్క రైతు నుంచి 20 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానించి అన్నదాతలను నిలువునా ముంచింది. వాస్తవానికి బ్లాక్ బర్లీ సాగుచేసిన రైతుల్లో 95 శాతం మంది 4 ఎకరాల నుంచి 40 ఎకరాల వరకూ పొగాకు పంటను సాగుచేశారు. మూడు ఎకరాలలోపు పొగాకు సాగుచేసిన వారు నామమాత్రంగానే ఉన్నారు. ఈ ఏడాది ఎకరానికి 17 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు జిల్లా వ్యవసాయశాఖ అంచనా కట్టింది. ఈ లెక్కన 1.50 ఎకరాలలోపు సాగుతోనే 20 క్వింటాళ్ల బ్లాక్ బర్లీ దిగుబడి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక్కొక్క రైతు నుంచి 1.50 ఎకరాలలో పండిన పొగాకునే కొంటానని చెప్పింది. ఒకవైపు టొబాకో కంపెనీలు మొక్కుబడిగా కొనుగోలు చేసి చేతులు దులుపుకుంటుండడంతో రైతులు పండించిన మిగిలిన పొగాకును ఎవరు కొనుగోలు చేస్తారో ప్రభుత్వం చెప్పలేదు.
రైతులను నిలువునా ముంచిన బాబు
మంత్రివర్గ నిర్ణయం చూస్తే బ్లాక్ బర్లీ రైతులను నిలువునా వంచించినట్లే కనపడుతోంది. ఆది నుంచి రైతులకు చంద్రబాబు ప్రభుత్వం మాటపై అపనమ్మకమే. ప్రతిపక్షనేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఒత్తిళ్లకు తలొగ్గి మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం ఆలస్యంగానైనా 12 కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోళ్లు మొదలు పెట్టింది. కొనుగోళ్లలో వివక్ష కనిపించినా ఆలస్యంగానైనా అందరి పొగాకు కొంటారని రైతులు భావించారు. చివరకొచ్చే సరికి ప్రభుత్వం ఏదొక సాకుచెప్పి తప్పించుకుంటుందని మిగిలిన రైతులతోపాటు రైతు సంఘాలు అనుమానిస్తూనే ఉన్నాయి. ఇప్పు డు వారు అనుమానించినట్లే జరిగింది. ఒక్కొక్క రైతు నుంచి 20 క్వింటాళ్ల కొనుగోలు మెలికతో ప్రభుత్వం పొగాకు కొనుగోళ్ల నుంచి తప్పించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి తమ లక్ష్యం 14 వేల టన్నులేనని మార్క్‌ఫెడ్ చెబుతోంది. ఇప్పటికే దాదాపు 4 వేల టన్నులు కొన్నామని, మరో 10వేల టన్నులు మాత్రమే కొంటామ ని చెప్పి చేతులు దులుపుకుంది. ఈ లెక్కన ప్రభుత్వం ప్రకటనకు చేతలకు పొంతన లేదని స్పష్టమవుతోంది.
రైతుల ఖాతాల్లో జమ కాని డబ్బు
వాస్తవానికి ఈ ఏడాది జిల్లాలో 53,067 ఎకరాల్లో రైతులు బ్లాక్ బర్లీ సాగు చేశారు. ఒక్క పర్చూరు నియోజకవర్గంలోనే 52,989 ఎకరాల్లో బర్లీ సాగైంది. అద్దంకి నియోజకవర్గంలో 78 ఎకరాలలో మాత్రమే పొగాకు సాగుచేశారు. వ్యవసాయశాఖ అంచనా ప్రకారం ఎకరాకు 17 క్వింటాళ్ల దిగుబడి అనుకుంటే మొత్తం 90 వేల టన్నుల దిగుబడి వచ్చింది. రైతులతో బ్లాక్ బర్లీ సాగుచేయించిన టొబాకో కంపెనీలు 30 వేల టన్నులలోపే కొనుగోళ్లు చేసి చేతులు దులుపుకున్నాయి. రైతుల వద్ద ఇంకా 50 వేల టన్నులకు పైగా పొగాకు ఉన్నట్లు తెలుస్తోంది. మార్క్‌ఫెడ్ 40 రోజులలో 3,700 టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. అదికూడా పచ్చపార్టీ నేతలు చెప్పిన రైతుల పొగాకు మాత్రమే కొన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ప్రభుత్వ నిర్ణయంపై పొగాకు రైతుల ఆగ్రహం
పండించిన పంట మొత్తం కొంటామన్న ప్రభుత్వం నేడు ఒక్కో రైతు నుంచి 20 క్వింటాళ్లే కొంటామని మెలిక జిల్లాలో 53,067 ఎకరాల్లో బర్లీ సాగు అధికారిక అంచనాల ప్రకారం 90 వేల టన్నుల దిగుబడి ఇప్పటివరకూ మార్క్‌ఫెడ్ ద్వారా కొన్నది 3,700 టన్నులే మరో 10 వేల టన్నులే లక్ష్యం అంటున్న మార్క్‌ఫెడ్ మిగిలిన పొగాకు ఎవరు కొంటారు?
ఎమ్మెల్యే ఏలూరి ఏమంటారో?
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మొదలు కొని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వరకూ రైతు పండించిన ప్రతి పొగాకు మట్ట కొంటామని, ఆందోళన చెందాల్సిన అవసరంలేదని బల్లగుద్ది చెప్పారు. ఒక్కొక్క రైతు నుంచి 20 క్వింటాళ్లు మాత్రమే కొంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం తేల్చి చెప్పడంతో ఇన్నాళ్లూ పొగాకు మొత్తం ప్రభుత్వం కొంటుందని బాకా ఊదిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతోపాటు ఆయన అనుచరగణం గొంతులో పచ్చివెళక్కాయ పడింది. ఇక నుంచి రైతులకు ఏం చెప్పాలో అర్థంకాక ఏలూరి తలపట్టుకున్నట్లు ఆయన అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం సొంత పార్టీ రైతులకూ ఆగ్రహం తెప్పిస్తోంది.