
ఆర్టీసీని బలోపేతం చేసేందుకు కృషి
బాపట్ల: రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా, క్రీడలశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ బాపట్ల డిపోను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శుక్రవారం సందర్శించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్న అతిపెద్ద సంస్థ ఏపీఎస్‌ఆర్టీసీ సంస్థ అని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. త్వరలో మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతామని చెప్పారు. ఏపీఎస్‌ఆర్టీసీ సంస్థకు పూర్వ వైభవం తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాపట్ల డిపోను మోడల్‌గా తయారు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. బస్టాండ్‌లో మరుగుదొడ్ల కాంప్లెక్స్‌ను నిర్మించడానికి, సిమెంట్ రహదారులు నిర్మిస్తామని చెప్పారు. బాపట్ల డిపోకు త్వరలో కొత్త బస్సులు కేటాయిస్తామని చెప్పారు. బాపట్ల నుంచి తిరుపతి, శ్రీశైలం బెంగళూరు ప్రాంతాలకు ప్రత్యేక బస్ సర్వీసులను నడపనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు నైట్ అలవెన్స్ రూ.130కి పెంచామని చెప్పారు. ఆర్టీసీ కార్గో సేవలను ఇంటింటికీ డెలివరీ చేసే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. బాపట్ల డిపోలో ఉత్తమ సేవలందించిన ఏడుగురు సిబ్బందికి మంత్రి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలోఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు, బుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్‌గౌడ్, ఏపీఎస్‌ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేంద్రప్రసాద్, జిల్లా ప్రజా రవాణా రవాణా అధికారి డి.సామ్రాజ్యం, బాపట్ల డిపో మేనేజర్ పి.శ్రీమన్నారాయణ, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్‌రెడ్డి, తహసీల్దార్ సలీమా తదితరులు పాల్గొన్నారు.
మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి