
రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి
గుంటూరు రూరల్: నగర శివారులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం నందు శనివారం జూలై నెలకు సంబంధించిన శిక్షణ, సందర్శన వర్క్‌షాప్‌ను నిర్వహించారు. కార్యక్రమానికి లాంఫాం ఏడీఆర్ దుర్గాప్రసాద్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో వివిధ డివిజన్ల ఏడీఏలు వ్యవసాయ స్థితిగతులు వివరించారు. శాస్త్రవేత్తలు పత్తి, కంది పంటల కట్ ఆఫ్ డేట్స్, వివిధ ప్రాతాలకు అనువైన వరి రకాలు, నేరుగా విత్తన వరిలో కలుపు యాజమాన్యం, జీవన ఎరువుల వినియోగం, ఎండు తెగులును తట్టుకునే కంది రకాలు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు వంటివి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్‌లో పంట వేయకుండా ఖాళీగా ఉంచి అనంతరం శనగ వేయదలచిన రైతులు స్వల్పకాలిక అపరాలు సాగు చేపట్టవచ్చని తెలిపారు. డీఏవో నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏటీఎంఏ సహకారంతో వ్యవసాయశాఖ, యూనివర్సిటీ ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సీజన్ ప్రారంభమైన సందర్భంగా విస్తరణ కార్యక్రమాలు, క్షేత్ర సందర్శనలు చేపట్టాలన్నారు. నానో ఎరువులు వినియోగం, డ్రోన్ల ద్వారా పురుగు మందుల పిచికారి, జీవన ఎరువుల పనితీరు, మెషీన్ హార్వెస్ట్‌ను అనుకూలమైన వ్యవసాయ యాజమాన్య పద్ధతులు రైతులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా డీఏవో శివకుమారి, వివిధ పంటల ప్రధాన శాస్త్రవేత్తలు, వివిధ డివిజన్ల ఏడీఏలు, కేవీకే, డాట్, ఉద్యాన, పరిశోధన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.