
మాదక ద్రవ్యాలతో జీవితం అంధకారం
– జిల్లా ఎకై ్సజ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు
ఖాజీపాలెం(కర్లపాలెం): మత్తు పదార్థాలకు బానిసలు అయితే జీవితమే అంధకారం అవుతుందని బాపట్ల జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ ఆఫీసర్ బి.వెంకటేశ్వర్లు చెప్పారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల అనర్థాలపై పిట్టలవానిపాలెం మండలంలోని ఖాజీపాలెం కేవీఆర్, ఎంకేఆర్ కాలేజీలో శనివారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వ్యక్తులతోపాటు సమాజంపై కూడా డ్రగ్స్ వల్ల తీవ్ర దుష్ప్రభావం ఉంటుందని చెప్పారు. ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ పి.గీతిక మాట్లాడుతూ ఆల్కహాల్, డ్రగ్స్ అనేవి చాలా ప్రమాదకరమైనవని చెప్పారు. డ్రగ్స్‌ను తరిమేద్దాం –ఆరోగ్యకర సమాజాన్ని నిర్మిద్దాం అని విద్యార్థులతో నినాదాలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ అధికారులు సాదిక్, దేబోరా, సైక్రియాట్రిస్ట్ సందీప్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎరుకల జాతి జిల్లా అధ్యక్షుడి నియామకం
వేమూరు: రాష్ట్ర కమిటీ ఆదేశాలు మేరకు ఎరుకల జాతి బాపట్ల జిల్లా అధ్యక్షులు బాలిక శిమన్నారాయణ ఎంపిక చేసినట్లు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.చిరంజీవి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వేమూరు మండల గ్రామానికి చెందిన శిమన్నారాయణ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేసి, అభినందనలు తెలిపారు.
హత్య కేసులో ఇద్దరు అరెస్ట్
రేపల్లె: మండలంలోని పేటేరు గ్రామంలో ఈ నెల 11వ తేదీన జరిగిన వ్యక్తి హత్య కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ సీఐ మల్లికార్జునరావు తెలిపారు. పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పేటేరులోని చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం వద్ద వ్యక్తి హత్యకు గురయ్యాడు. మద్యం తాగే విషయంలో గొడవలో నిజాంపట్నం మండలం కూచినపూడి గ్రామానికి చెందిన గున్నం వెంకటేశ్వర్లు, గున్నం వరదయ్యలు కలిసి శ్రీను అనే వ్యక్తిని సీసా గాజుతో హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. వరదయ్య, వెంకటేశ్వర్లు ప్రస్తుతం తెనాలిలో ఉంటుందన్నారని పేర్కొన్నారు. శ్రీను వివరాలు తెలియరావాల్సి ఉందన్నారు. నిందితులను కోర్టుకు హాజరుపరచగా, 15 రోజులు రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.

మాదక ద్రవ్యాలతో జీవితం అంధకారం