
పెండింగ్ కేసుల్లో అరెస్ట్‌లు త్వరితగతిన చేయాలి
నగరంపాలెం: పెండింగ్ కేసుల్లో అరెస్ట్‌లను త్వరితగతిన చేయాలని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్‌లో శనివారం అర్ధ వార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కేసుల విచారణలో పోలీసుల చర్యలు వేగవంతంగా ఉండాలని తెలిపారు. తద్వారా న్యాయస్థానాల్లో నిందితులకు శిక్షలు ఖరారవుతాయని అన్నారు. ఎప్పటికప్పుడు కేసులకు సంబంధించి సమాచారం సీసీటీఎన్‌ఎస్‌లో నమోదు చేయాలన్నారు. గడువులోగా చార్జిషీట్లను కోర్టుల్లో దాఖలు చేయాలని చెప్పారు. జిల్లాలో 170 మంది రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. వారిలో పీడీ యాక్ట్ పెట్టాల్సిన వారిని గుర్తించి చర్యలు చేపట్టాలని అన్నారు. డ్రోన్ల సాయంతో నగర, శివారు ప్రాంతాలు, శిథిలావస్థకు చేరిన భవనాలు, ముళ్లపొదలపై నిఘా ఉంచాలన్నారు. తద్వారా అసాంఘిక కార్యక్రమాలను కట్టడి చేయాలని చెప్పారు. విధుల్లో పోలీస్ అధికార, సిబ్బంది విధిగా బాడీ వార్న్ కెమెరాలు ధరించాలని స్పష్టం చేశారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ బర్కత్ అలీ మాట్లాడుతూ పోక్సో, ఇతర కేసుల్లో చార్జిషీట్లల్లో తప్పులు దొర్లకుండా దాఖలు చేయాలని అన్నారు. న్యాయ సలహాలకై తమను సంప్రదించాలని చెప్పారు. న్యాయస్థానాల్లో బాధితులకు న్యాయం అందించేందుకు పోలీస్, న్యాయశాఖ ఐక్యంగా పనిచేయాలన్నారు. నిందితులకు శిక్షల ఖరారులో ప్రముఖంగా వాదించిన ఎండీ బర్కత్‌అలీ, ఏపీపీ కె.రమేష్, డీసీఆర్‌బీ సీఐ బి.నరసింహారావు, పలు కేసుల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టి సాక్ష్యాధారాలను సేకరించిన అప్పటి డీఎస్పీలు కె.రవికుమార్, వై.జెస్సీ ప్రశాంతి, సీఐలు పి.సుధాకర్‌రావు, నారాయణస్వామి, వీరయ్యచౌదరి, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, జి.సంధ్యారాణి, పోలీస్ సిబ్బందికి ప్రశంసా పత్రాలను జిల్లా ఎస్పీ అందించారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీ ఏటీవీ రవికుమార్ (ఎల్/ఓ), జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.