
విపత్తులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి
బాపట్ల: తుపాను హెచ్చరికల నేపథ్యంలో విపత్తును ఎదుర్కోవడానికి అధికారులు సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. విపత్తు నిర్వహణ, నిర్మూలన ప్రణాళికపై కలెక్టర్ జిల్లా, మండల స్థాయి అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎగువ ప్రాంతాలలో అధికంగా వర్షాలు కురుస్తున్నందున కృష్ణానది వరద విపత్తును దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విపత్తును ఎదుర్కోవడానికి ముందస్తుగా ప్రణాళిక రూపొందించాలన్నారు. ప్రస్తుతం ఆలమట్టి, శ్రీశైలం, నాగార్జునసాగర్, కృష్ణా బ్యారేజి 90 శాతం నిండుగా ఉండడంతో ఎగువ నుంచి వరద వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కృష్ణానది కరకట్టపై నివాసముంటున్న గృహాల సర్వే చేయాలన్నారు. కరకట్టకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక, కంకర బస్తాలు సిద్ధం చేసుకుని కట్టను బలోపేతం చేయాలన్నారు. మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. తీర ప్రాంత మండలాలలో గుడిసెలు, సిమెంటు రేకుల ఇళ్లను ముందస్తుగా గుర్తించాలని కలెక్టర్ చెప్పారు. తీరానికి పది కిలోమీటర్ల మేర తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. గర్భిణులు, వృద్ధులు, మంచం పట్టిన వారు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, చిన్నారులను గుర్తించి వివరాలు సిద్ధంగా ఉంచాలన్నారు. పునరావాస కేంద్రాల ఏర్పాటు, గ్యాస్ సిలిండర్, డీజిల్, కిరోసిన్, జనరేటర్లు, చెట్లు తొలగించడానికి యంత్రాలు, తదితర యంత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు, విద్యుత్ స్తంభాల పునరుద్ధరణకు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ జి గంగాధర్‌గౌడ్, ఆర్డీఓలు, జిల్లా అధికారులు, వీక్షణ సమావేశం ద్వారా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
స్వాతంత్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలి
స్వాతంత్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం ఏర్పాట్లపై ముందస్తు సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. పోలీస్ కవాతు మైదానాన్ని ముస్తాబు చేయాలని, జిల్లా ప్రగతి, అభివృద్ధిని చాటి చెప్పేలా శకటాల ప్రదర్శన ఉండాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. విశేష సేవలు అందించిన ఉద్యోగులను ప్రశంసాపత్రాలతో సత్కరించడానికి అర్హులైన వారిని గుర్తించాలన్నారు. స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించడానికి ఆహ్వానించాలన్నారు. వైద్య శిబిరాలు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో జి.గంగాధర్‌గౌడ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సామాజిక వెనుకబాటులో
ఉన్న వారిని ఆదరించాలి
సామాజిక వెనుకబాటులో ఉన్న ఎస్టీలు, విభిన్న ప్రతిభావంతులను ఆదరించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. ఎస్టీలు, విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్‌న్స్ కార్యక్రమం శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు కలెక్టర్‌కి అర్జీలు అందజేశారు. తన పరిధిలోని వాటికి కలెక్టర్ తక్షణమే పరిష్కార మార్గం చూపారు.
మిగిలిన నగదు ప్రభుత్వానికి చెల్లించాలి
ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీలో మిగిలిన నగదును ప్రభుత్వానికి తక్షణమే తిరిగి చెల్లించాలని కలెక్టర్ వెంకట మురళి ఆదేశించారు. అలా చెల్లించకుండా ఉన్న వారికి తక్షణమే చార్జి మెమోలు జారీ చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో జి గంగాధర్ గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
వృద్ధాప్యంలో తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత పిల్లలదే
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత పిల్లలపై ఉందని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. వృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం అమలు తీరుపై అవగాహన కార్యక్రమం శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులను చూడకుండా దూరంగా ఉంచితే పోషణ ఖర్చు కింద వారికి నెలకు రూ.10వేలు ఇవ్వాలన్నారు. డబ్బులు ఇవ్వకుండా నిలిపివేస్తే మూడు నెలలు జైలు శిక్ష ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీఆర్వో జి గంగాధర్‌గౌడ్, వృద్ధుల సంక్షేమ శాఖ అధికారి సువార్త, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఏ నాగధీర భద్రాచారి పాల్గొన్నారు.