
కొత్తపేటకు ఎన్నికల కళ
వేటపాలెం: ఎట్టకేలకు నాలుగేళ్ల నిరీక్షణ తరువాత కొత్తపేట పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్ల జాబితాలు, పోలింగ్ బూత్‌లతో సహా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల తేదీ ఖరారు చేయాల్సి ఉంది. కొత్తపేటలో 11,500 మంది ఓటర్లు, 16 వార్డులు, 32 పోలింగ్ బూత్‌లున్నాయి. 2020లో ఆధిపత్యం కోసం తెలుగుదేశం నాయకులు చేసిన ఘనకార్యం వల్ల చీరాల నియోజకవర్గంలో 23 గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ ఎన్నికల నిలిచి పోయాయి. వేటపాలెం మండల పరిధిలో మొత్తం తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉండగా వేటపాలెం, దేశాయిపేట, కొత్తపేట వంటి మేజర్ పంచాయతీలు. వీటి పరిధిలో 16 శివారు గ్రామాలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2021 ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహించారు. అయితే చీరాల రూరల్, వేటపాలెం మండలాల పరిధిలోని 23 గ్రామ పంచాయతీలు ఐదేళ్లుగా పంచాయతీ ఎన్నికలకు నోచుకోలేదు. నాడు వేటపాలెం పరిధిలోని రామన్నపేట పంచాయతీకీ మాత్రమే ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి.
గ్రామ పంచాయతీల పునర్విభజన ...
చీరాల రూరల్ మండల పరిధిలోని గ్రామ పంచాయతీల పునర్విభజన జరిగాయి. కొత్తగా రెండు గ్రామ పంచాయతీలకు ప్రదిపాధనలు పంపారు. అదేవిధంగా వేటపాలెం మండలంలో ఉన్న తొమ్మిది గ్రామ పంచాయతీలను పునర్విభజన చేసి అదనంగా మరో మూడు పంచాయతీలకు ప్రతిపాదనలు సిద్ధం చేసి నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పట్లో ఇది గిట్టని టీడీపీ నాయకులు పునర్విభజనపై హైకోర్టులో 2020లో కేసు వేశారు. దీంతో ఎన్నిలు నిలిచిపోయాయి.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
పంచాయతీల పునర్విభజనపై హైకోర్టులో కేసులు వేసిన అప్పటి టీడీపీ నేతలు
కోర్టులో కేసులు తొలగిపోవడంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం
మిగిలిన పంచాయతీల సంగతేమిటి?
హైకోర్టులో వేసిన కేసుల కారణంగా చీరాల నియోజకవర్గ పరిధిలో 2021 నుంచి 23 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిలిచి పోయాయి. అయితే దీనిపై ఆరు నెలల క్రితం కొత్తపేటవాసులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు తీర్పు రాగానే కొత్తపేట పంచాయతీ పరిధిలోని కొందరు గ్రామ పంచాయతీకి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై కోర్టు ఆరు నెలల్లో కొత్తపేట పంచాయతీకి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఎన్నికల కమిషనర్ జూన్ 17 తేదీ నాటికి ఓటర్ల జాబితాలు, బూత్‌లు సిద్ధం చేయాలని ఆదేశించారు. మరి చీరాల నియోజకర్గ పరిధిలో మిగిలిన 22 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఎప్పడు జరుగుతాయో చూడాల్సిందే.