
సిరులు కురిపిస్తున్న ఇసుక దందా
చీరాలటౌన్: ప్రకృతి వనరులు తరలిపోతున్నాయి. కూటమి నేతృత్వంలో అవినీతి తార స్థాయికి చేరుతోంది. ఇసుక కోసం గబ్బర్‌సింగుల్లా మారిన అక్రమార్కుల దెబ్బకు నేల తల్లి విలవిల్లాడిపోతోంది. అధికార పార్టీ ముఖ్యనేత అండదండలతో ఇసుక దందాతో పేట్రేగిపోతున్నారు. స్థానిక పోలీసు, రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు దొరికినంత జేబుల్లో వేసుకుని అక్రమార్కులకే వత్తాసు పలుకుతున్నారు. ప్రధానంగా చీరాల మండలంలోని సముద్ర తీర ప్రాంతంతో పాటు ఆటోనగర్ సమీపంలో, 216 జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భూములు, ఈపూరుపాలెం, విజయనగర్‌కాలనీ, సావరపాలెం, బోయినవారిపాలెం, తోటవారిపాలెం, పాతచీరాల తదితర ప్రాంతాల్లో ఇసుక దిబ్బలను ఇబ్బడిముబ్బడిగా కొల్లగొడుతున్నారు. రోజుకు 150 ట్రాక్టర్లు, టైరు బండ్ల ద్వారా ఇసుక తరలిస్తూ లక్షలు వెనుకేసుకుంటున్నారు. ఈపురుపాలెం, బోయినవారిపాలెం, ఆటోనగర్ సమీపంలో ఈపురుపాలెంకు చెందిన ‘పరోట’ ఇసుకను అక్రమంగా 24 గంటలపాటుగా ఇబ్బడిముబ్బడిగా అమ్మకాలు చేస్తున్నాడు. శివారు కాలనీలు, ప్రధాన రోడ్డుపై వెళితే చాలు ఎక్కడ చూసినా ఇసుక తరలిస్తున్న టాక్టర్లు, టైరుబండ్లు కనిపిస్తూనే ఉన్నాయి. చీరాల పట్టణంతోపాటు చుట్టు పక్కల గ్రామాలకు తరలిస్తున్నారు. ఇసుక అక్రమార్కులకు కల్పవృక్షంగా మారింది. గతంలో గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి సమయంలో టైరుబండ్లలో ఇసుక తరలించే వారు. కానీ నేడు వారి ఇష్టం వచ్చినట్లు తవ్వేసుకుంటున్నారు. టైరు బండి రూ.2వేల వరకు, ట్రాక్టర్ రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారు.
కొత్తవారు ఎంట్రీ...
ఇసుక అక్రమ వ్యాపారం చేస్తే అతి కొద్దిరోజుల్లోనే లక్షలు గడిస్తుండటంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ వ్యాపారంపై పడింది. చీరాల మండలంలోని రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఈపురుపాలెం, బోయినవారిపాలెం, తోటవారిపాలెం, గవినివారిపాలెంతోపాటు విజయనగర్‌కాలనీ, పాతచీరాల తదితర గ్రామాల్లో అధికార పార్టీ నేత అండతో పరోటా, చోటామోటా రాజకీయ నాయకులతోపాటు పలువురు ఇసుక అక్రమ వ్యాపారంలోకి దిగారు. ముఖ్యంగా ఇసుక వ్యాపారం చేస్తే జీవితంలో సెటిల్ అయిపోవచ్చనే నమ్మకంతో చాలా మంది కొత్తగా ఇసుక దందాకు దిగారు.
‘పరోట’ నేతృత్వాన మండలంలో జోరుగా ఇసుక తవ్వకాలు పట్టించుకోని అధికారులు అందరి చూపు ఈ వ్యాపారం పైనే..
చర్యలు తీసుకుంటాం
ఇసుక అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించం. గ్రామాల్లో రెవెన్యూ సిబ్బందితో తనిఖీలు చేస్తున్నాం. ఈపురుపాలెం, బోయినవారిపాలెం, పాతచీరాల, తీర ప్రాంత గ్రామాల్లో అక్రమంగా ఇసుక క్వారీలు నిర్వహించినా, అమ్మకాలు చేసినా చట్ట ప్రకారం చర్యలు తప్పవు.
–కుర్రా గోపీకృష్ణ: తహసీల్దార్

సిరులు కురిపిస్తున్న ఇసుక దందా