
ఓటరు క్లెయిమ్‌లపై విచారణ
చీరాల టౌన్: చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరు క్లెయిమ్‌లపై బీఎల్‌వోలతో సమర్థంగా విచారణ నిర్వహిస్తున్నామని ఈఆర్‌వో, ఆర్డీవో తూమాటి చంద్రశేఖరనాయుడు తెలిపారు. గురువారం చీరాల తహసీల్దార్ కార్యాలయంలో అన్ని రాజకీయపార్టీల నాయకులతో ఓటరు క్లెయిమ్‌లపై విచారణ సమావేశాన్ని నిర్వహించారు. ఆర్డీఓ మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో ఓటరు క్లెయిమ్ అర్జీలు పెండింగ్‌లో లేకుండా విచారణ చేస్తున్నామని తెలిపారు. రాజకీయ పార్టీల నాయకులు తమ బూత్ ఏజెంట్లతో విచారణ చేయించుకోవచ్చన్నారు. క్లెయిమ్ అర్జీని నిశితంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో అవాంతరాలు లేకుండా విచారణ చేస్తున్నారని, ఏమైనా అభ్యంతరాలుంటే వివరాలను తెలియజేయాలన్నారు. ఇటీవల మృతి చెందిన ఓటర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు. ప్రతి బీఎల్‌వో వారికి కేటాయించిన పోలింగ్ బూత్‌లోని ఓటర్ల పూర్తి వివరాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఈసీ నిబంధనల ప్రకారం విచారణ చేయాలని, ఇష్టానుసారంగా విధులు నిర్వహించవద్దనే ఆదేశాలు జారీ చేశామన్నారు. సమస్యలను తనకు గానీ, ఏఈఆర్వోలకు గాని తెలియజేయాలని కోరారు. రాజకీయపార్టీల నాయకులకు ఉన్న పలు అనుమానాలను ఆర్డీఓ నివృత్తి చేశారు. తహసీల్దార్ కుర్రా గోపికృష్ణ, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, డీటీ సుశీల, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రభుత్వ స్థలాలు ఆక్రమించడం నేరం
జె.పంగులూరు: ప్రభుత్వ స్థలాలు ఆక్రమించడం నేరమని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు హెచ్చరించారు. మండల పరిధిలోని కొండమంజులూరు జాతీయ రహదారి వెంబడి గత సర్వే నెంబర్ 58లో ఆక్రమణకు గురైన డొంక పోరంబోకును ఆర్డీఓ గురువారం పరిశీలించారు. 58 సర్వే నెంబర్‌లో మొత్తం 2.47 ఎకరాలు డొంక పోరంబోకు ఉన్నట్లు అధికారులు ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆక్రమణకు గురైన డొంక పోరంబోకు స్థలాన్ని గుర్తించి, ఆక్రమించిన వారిని గుర్తించి సమాచారం అందించాలని తెలిపారు. అనంతరం పంచాయతీ, రెవెన్యూ అధికారులు.. ఆక్రమించిన వారికి నోటీసులు పంపించి స్థలం స్వాధీనం చేసుకోవాలని కోరారు. కొండమంజులూరు గ్రామానికి ఆనుకొని ఉన్న మట్టి దిబ్బను పరిశీలించారు. అక్రమ మట్టి తవ్వకాలు జరిగినట్లు గుర్తించారు. అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తూర్పు కొప్పెరపాడులోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పొగాకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 14 వేల టన్నుల పొగాకు కొనుగోలు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ పి.సింగారావు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
ఆర్డీఓ చంద్రశేఖర నాయుడు

ఓటరు క్లెయిమ్‌లపై విచారణ