
పీ4 పథకంతో పేదలకు చేయూత
రేపల్లె: సమసమాజ నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీరో పావర్టీ పీ–4 పథకం ద్వారా పేదలకు చేయూతనిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. జీరో పావర్టీ – పీ–4 పథకంలో భాగంగా చెరుకుపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గ్రామసభలో కలెక్టర్ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుపేదలను గుర్తించి వారి కనీస అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం పీ–4 పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి గ్రామంలో ఆర్థికంగా స్థిరపడిన వారి నుంచి ఆ గ్రామంలోని నిరుపేదలను ఎంపిక చేసి చేయూతనివ్వటం జరుగుతుందన్నారు. చెరుకుపల్లిలోని 10 ఎస్టీ కుటుంబాలను పీ–4 సర్వే ద్వారా ఎంపిక చేసి ఆదుకునేందుకు దత్తత తీసుకున్నామన్నారు. 10 ఎస్టీ కుటుంబాల స్థితిగతులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేసుకునేందుకు జాబ్‌కార్డులు కావాలని, పక్కా గృహాలు నిర్మించి అందించాలని, స్వయం ఉపాధి పొందేందుకు మార్గాలు చూపించాలని పలు కుటుంబాల సభ్యులు కలెక్టర్‌తో చెప్పారు. స్పందించిన అర్హులైన ప్రతి ఒక్కరికి జాబ్‌కార్డులు మంజూరు చేయాలని, పక్కా గృహాలను కేటాయించాలని, అర్హులైన యువకులకు స్వయం ఉపాధి కల్పించేందుకు వారి ఆసక్తి మేరకు బ్యాంకుల నుంచి రుణాలు కేటాయింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సంపన్నుల కుటుంబాల నుంచి అందే సాయంతోపాటు వ్యక్తిగతంగా సాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. యానాదుల యూత్ ఫెడరేషన్ బాపట్ల జిల్లా అధ్యక్షుడు చౌటూరి రమేష్ జిల్లా కలెక్టర్ వెంకట మురళికి పుష్పగుచ్చం అందించి సత్కరించారు. కార్యక్రమంలో రేపల్లె ఆర్డీఓ నేలపు రామలక్ష్మి, సీపీవో ఏఎస్ రాజు, డీఆర్‌డీఏ పీడీ కే.శ్రీనివాసరావు, మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్, తహసీల్దార్ సీహెచ్ పద్మావతి, ఎంపీడీవో షేక్ మహబూబ్ సుభాని, డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, వీఆర్వోలు పాల్గొన్నారు.
మడ అడవుల దినోత్సవాన్ని
జయప్రదం చేయాలి
బాపట్ల: మడ అడవుల దినోత్సవాన్ని జయప్రదంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. మడ అడవుల దినోత్సవం నిర్వహణపై మొక్కలు నాటే ప్రాంతాలను జిల్లా కలెక్టర్ గురువారం పరిశీలించారు. సూర్యలంక తీర ప్రాంతం, నగర వనాన్ని ఆయన పరిశీలించారు. మడ అడవుల దినోత్సవానికి బాపట్ల సూర్యలంకకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె పవన్ కల్యాణ్ జిల్లాకు రానున్నారని కలెక్టర్ చెప్పారు. మడ అడవులు వృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అందులో భాగంగా మొక్కలు నాటుతామన్నారు. సూర్యలంకలోని అటవిశాఖకు చెందిన నగరవనం, సూర్యలంక తీర ప్రాంతంలోని అటవీ భూములను కలెక్టర్ పరిశీలించారు. మడ అడవులు పెరగడం ద్వారా ప్రకృతి విపత్తుల మంచి తీవ్రమైన నష్టం జరగకుండా అరికట్టగలమన్నారు. వాటి ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మంత్రి పర్యటన జయప్రదం చేసేందుకు అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఆయన వెంట జిల్లా అటవీ శాఖ అధికారి వినోద్‌కుమార్, డీపీఓ ప్రభాకర్ డ్వామా పీడీ విజయలక్ష్మి, బాపట్ల ఆర్డీవో గ్లోరియా తదితరులు పాల్గొన్నారు.
చెరుకుపల్లి గ్రామసభలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి