
ఔచిత్యం పాటించే కవిత్వం ప్రేక్షకులను రంజింప చేస్తుంది
డాక్టర్ సుద్దాల అశోక్‌తేజ
బాపట్ల: ఔచిత్యం పాటించే కవిత్వం ఏదైనా ప్రేక్షకులను, పాఠకులను రంజింప చేస్తుందని సాహితీవేత్త, సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ అన్నారు. వివేక సర్వీస్ సొసైటీ, ధృతి సాహిత్య సాంస్కృతిక సామాజిక సంస్థ సంయుక్త నిర్వహణలో నెలనెల నందివర్ధనం 103వ కార్యక్రమం బాపట్ల జిల్లా వెదుళ్లపల్లిలోని వివేకా కార్యాలయంలో గురువారం జరిగింది. నా కవిత్వ తత్వం నిర్మాణం గమనం గమ్యం అనే అంశంపై సుద్దాల అశోక్ తేజ ప్రసంగించారు. పాట, సంగీతం, సాహిత్యం తన కుటుంబం నుంచి వారసత్వంగా తనకు వచ్చాయని, తండ్రి హనుమంతు నుంచి ఎన్నో మెళకువలు నేర్చుకున్నానని చెప్పారు. ఎలాంటి సాహిత్యానికై నా, కవిత్వానికై నా ఔచిత్య భంగం కలగకూడదని తాను విశ్వసిస్తానన్నారు. కవిత్వానికి పునాదిగా ఔచిత్యాన్ని క్రమం తప్పకుండా పాటించడం అనేది తనకు అలవాటు అయ్యిందని స్పష్టం చేశారు. తన సాహిత్యం యావత్తూ ప్రజలను చైతన్యం చేసే విధంగా ప్రకృతి, శ్రమ, సీ్త్ర, మానవ సంబంధాలు అనే అంశాల మీద కొనసాగిందన్నారు. సాహిత్యం ప్రజల చెవిని, హృదయాన్ని రెండింటినీ తాకే విధంగా మంచి ఎత్తుగడతో ముందుకు సాగాలని తన తండ్రి చేసిన సూచన మేరకు తన కవిత్వ ప్రస్థానం కొనసాగిందన్నారు. నేలమ్మ నేలమ్మ నేలమ్మ నీకు వేల వేల వందనాలమ్మ.. అంటూ ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే కవిత్వం, ప్రతి సీ్త్రలో అమ్మ ను, సోదరిని చూడాలనే సందేశంతో సీ్త్ర ఔన్నతాన్ని తెలియజేసే కవిత్వం, శ్రమ శక్తి గొప్పతనాన్ని తెలియజేసే కవిత్వం, మానవ జీవన సౌందరాన్ని , మానవ సంబంధాల గొప్పతనా న్ని, ప్రత్యేకతను తెలియజేసే కవిత్వం తన నుంచి ప్రసవించి, ప్రసరించిందన్నారు. ‘తెలుగు సినీ గేయ సాహిత్యం‘ అనే శీర్షికతో నెలనెల నందివర్ధనం కార్యక్రమాల ప్రసంగ పాఠాల సంచికను డాక్టర్ సుద్దాల ఆవిష్కరించారు. వివేక సర్వీస్ సొసైటీ అధ్యక్షులు ఎన్‌వీ నాగరాజు, కార్యదర్శి అంబటి మురళికృష్ణ, ధృతి అధ్యక్షులు కళ్లం హరినాధరెడ్డి, కార్యదర్శి చాపల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.