
గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
డీఆర్‌ఓ జి.గంగాధర్‌గౌడ్
బాపట్ల: గంజాయి రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్ గౌడ్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్ హాలులో మాదకద్రవ్య నివారణ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో, కళాశాలల్లో ఈగల్ టీంలను ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. యువత, విద్యార్థులు ఎక్కువగా వినియోగిస్తున్నారని అన్నారు. వ్యక్తిగతంగా నష్టపోవడంతోపాటు సమాజంలోనూ తీవ్ర దుష్పరిణామాలు ఉత్పన్నం అవుతున్నాయని అన్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంలో ప్రభుత్వ అధికారులతోపాటు విద్యాసంస్థల నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా సహకారాన్ని అందించాలన్నారు. క్రైం డీఎస్పీ జగదీష్ నాయక్ మాట్లాడుతూ అధికారులు అందరూ సహకరించాలని కోరారు. జిల్లాలో 2022 –25 సంవత్సరం వరకు మొత్తం 73 కేసులు నమోదు చేశామని తెలిపారు. జిల్లాలో 64 మంది గంజాయి సరఫరా, 275 మంది విక్రేతలను గుర్తించామని చెప్పారు. విస్తృత తనిఖీలు చేయడంతోపాటు జిల్లాలో 14 యాంటీ గంజాయి టీంలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గంజాయి రవాణా, సరఫరా వివరాలు తెలిస్తే వివరాలను 1972 టోల్ ఫ్రీ నెంబరుకు తెలియజేయాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచో డాక్టర్ విజయమ్మ, రవాణా శాఖ అధికారి పరంధామ రెడ్డి, పోర్టు అధికారి బీవీఎం మూర్తి, ప్రొబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి వెంకటేశ్వరరావు, బీసీ సంక్షేమ అధికారి రాజ్‌దేబోరా, వికలాంగుల సంక్షేమ అధికారి సువార్త, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, షాడో స్వచ్ఛంద సంస్థ ఎన్జీవో రాజా సాల్మన్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.