
గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి
నాదెండ్ల: ఓ యంత్ర పరికరాన్ని దిగుమతి చేసేందుకు వచ్చిన లారీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఎన్టీఆర్ జిల్లా చిరువూరు మండలం, వావిలాల గ్రామానికి చెందిన దంతాల వీరభద్రరావు (67) చిలకలూరిపేటలో లారీ ట్రాలర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం నరసరావుపేటలో ఓ యంత్ర పరికరాన్ని లోడ్ చేసుకుని గణపవరం గ్రామానికి వచ్చాడు. శుక్రవారం ఉదయం కూలీలు రాకపోయేసరికి 10 గంటలకు ట్రాలర్ యజమానికి ఫోన్ చేసి తనకు ఆరోగ్యం బాగా లేదని చెప్పాడు. సమీపంలోని దుకాణంలో గ్యాస్ తగ్గడానికి పౌడర్ ప్యాకెట్ తీసుకుని నీటిలో కలిపి తాగాడు. లారీలో విశ్రాంతి తీసుకున్నాడు. 11.30 గంటల సమయంలో ట్రైలర్ యజమాని ఫోన్ చేయగా వీరభద్రరావు ఫోన్ స్విచాఫ్‌లో ఉంది. దీంతో యజమాని అక్కడకు చేరుకుని చూడగా, వీరభద్రరావు లారీలో మృతి చెంది కనిపించాడు. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి నాదెండ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్సై జి.పుల్లారావు మృతుడి కుమారుడితో ఫోన్‌లో మాట్లాడారు. మృతదేహాన్ని స్వగ్రామానికి పంపారు. గుండెపోటు కారణంగా వీరభద్రరావు చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.