
వేరుశనగ సాగుకు కేరాఫ్ బాపట్ల
బాపట్ల : ఇరవై ఏళ్ల కిందట వరకు బాపట్ల మండలం స్టువార్టుపురం నుంచి కర్లపాలెం వెళ్లేంతవరకు రహదారికి ఇరువైపులా ఖాళీ పొలాలు దర్శనమిచ్చేవి. అక్కడక్కడ ఆకుకూరలు, కూరగాయలు సాగు చేసే వారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన ఉచిత విద్యుత్ పథకంతో బీడు భూములు కాస్త సాగులోకి వచ్చాయి. ప్రస్తుతం పొలాలన్నీ పచ్చదనం సంతరించుకున్నాయి. ఏడాది పొడవునా వేరుశెనగ పంట సాగు చేస్తున్నారు.
ఉచిత పథకంతో మహర్దశ
గతంలో నీటి సౌకర్యం లేక బీడు భూములను తలపించేలా ఉండే పంట పొలాలు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం ఉచిత విద్యుత్ పథకం ఫైలుపై చేశారు. పథకం ఈ ప్రాంత రైతులకు వరంగా మారింది. ఈ పధకం కింద చిన్నగంజాం, వేటపాలెం, చీరాల, బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాల పరిధిలో సూదూర ప్రాంతం నుంచి విద్యుత్ లైన్లు సౌకర్యం ఏర్పాటుచేసుకొని పొలాల్లో బోర్లు దింపి వాటి సహాయంతో వేరుశనగ సాగుచేస్తున్నారు. మొదట్లో 2 వేల ఎకరాలలో వేరుశనగ సాగుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం 15వేలకు పైగా ఎకరాలలో వేరుశనగ సాగు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లోని ఏ ఒక్క రైతును పలుకరించిన మహానేత అమలుచేసిన ఉచిత విద్యుత్ పథకమే మా బతుకుల్లో వెలుగులు నింపిందంటూ ముక్తకంఠంతో చెబుతున్నారు.
వేలాది కుటుంబాలకు నిత్యం ఉపాధి
ఒకప్పుడు ఈ ప్రాంతంలోని కూలీలకు ఖరీఫ్ సీజన్‌లో మాత్రమే వ్యవసాయ పనులుండేవి. సీజన్ ముగిసిన తర్వాత ఏడాది అంతా ఖాళీగా ఉండేవారు. ప్రస్తుతం వేరుశనగ ఏడాది పొడవునా సాగు చేస్తుండడంతో ఆయా గ్రామాల్లోని వేలాది మంది కూలీలకు ఏడాది పొడవునా ఉపాధి లభించింది. వేరుశెనగ పొలంలో తక్కు రొల్లడం, కలుపు తీయటం, కాయలు కోయటం, కల్లాలను శుభ్రం చేయటం, కాయలు నుంచి పప్పును వేరు చేయటం లాంటి పనులు నిత్యం ఉంటున్నాయి. దీంతో ఉపాధి కోసం వలసలు వెళ్లే అవసరం లేకుండా గ్రామంలోనే ఉపాధి దొరుకుతుందని కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇతర జిల్లాలకు ఎగుమతి
రాష్ట్రంలోనే వేరుశనగ సాగుకు అనంతపురం జిల్లా పేరుగాంచింది. ప్రస్తుతం బాపట్ల జిల్లా కూడా అనంతపురం జిల్లా సరసన చేరింది. వేరుశెనగ ప్రస్తుతం ఎకరాకు 30 నుంచి 35 బస్తాల దిగుబడి వస్తుంది. మార్కెట్‌లో బస్తా రూ.2,500 ఉండగా దళారులు రైతుల వద్ద రూ.2వేలకే కొనుగోలు చేసి వాటిని ఇతర ప్రాంతాలకు తరలించి రూ.2500కు అమ్ముకుని లాభాలు ఆర్జిస్తున్నారు. వేరుశెనగ కాయలతోపాటు ఉడికించిన కాయలు, వేరుశనగ పచ్చి పప్పు, వేయించిన పప్పు, వాటి నుంచి నూనె, వేరుశెనగతో తయారుచేసి తినుబండరాలను కూడా ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు.
ఏడాదిలో రెండు, మూడుసార్లు సాగు
ఇతర జిల్లాలకు ఎగుమతి
వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకంతో
సాగులోకి వచ్చిన బీడు భూములు
రాజన్నను మరువలేమంటున్న రైతులు

వేరుశనగ సాగుకు కేరాఫ్ బాపట్ల