
బాబోయ్.. వెజి‘ట్రబుల్స్’
●
అద్దంకి: వర్షాభావ పరిస్థితుల కారణంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రెండు రోజుల్లోనే ధరలు రెట్టింపు కావడంతో సామాన్యులు, పేదలు బెంబేలెత్తిపోతున్నారు. వందలు ఖర్చు చేసినా ఓ చిన్న కుటుంబానికి నాలుగైదు రోజులకు సరిపడా కూరగాయాలు రావడం లేదు. పచ్చి మిర్చి ధర కిలో రూ.120కి చేరుకుంది. మిగిలిన కూరలు కిలో రూ.50పైగానే పలుకుతున్నాయి. మరో వైపు నిత్యావసర వస్తువుల ధరలు కూడా చేతికందే పరిస్థితి లేకపోవడంతో పేదలు కనీసం పచ్చడి మెతుకులు వండుకోవడానికీ ఆలోచించాల్సి వస్తోంది. ప్రతి వంటకు అవసరమైన పచ్చిమిర్చితో పాటు మునగ కాయలు కూడా కొండెక్కాయి. కిలో పచ్చిమిచ్చి నాలుగు రోజుల కిందట రూ.50 ఉండగా, ప్రస్తుతం రూ.120 చేరుకుంది. మునగ రూ.120 పలుకుతోంది. రూ.20 ఉండే బీర, దోస ధరలు రూ.60కి పైమాటే. ఇక క్యారెట్, బీట్రూట్ రూ.70 పలుతున్నాయి. చిక్కుడు ధర రూ.90కి పైమాటే. టమోటా కిలో ధర రూ.40 వరకు పలుకుతోంది. ఆకుకూరల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో సామాన్యుడు విలవిల్లాడిపోతున్నాడు. వర్షాలు లేకపోవడంతో కూరగాయలు పండలేదని, సుదూరప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సి రావడంతోనే ధరలు బాగా పెరిగిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాలు పడినా, ఈ ప్రాంతంలోని భూముల్లో కూరగాయలు పండి మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చేసరికి కనీసం నలభై నుంచి యాభై రోజులు పడుతుందని, అప్పటివరకూ ఈ ధరలు భరించక తప్పదేమోనని ప్రజలు భయపడుతున్నారు.
కూరగాయ రకం ధర (రూ)
పచ్చి మిర్చి 120
మునగకాయలు 120
చిక్కుళ్లు 90
క్యారెట్ 80
బీట్రూట్ 70
బంగాళాదుంప 50
దోస 40
బెండ 60
బీర 60
కొండెక్కిన కూరగాయల ధరలు
మంట పుట్టిస్తున్న పచ్చిమిర్చి

బాబోయ్.. వెజి‘ట్రబుల్స్’