
నేడు మారనున్న రూపు
ఏ ప్రభుత్వానికై నా ముందు చూపు అవసరం. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఫలాలు ప్రజలకు అందుతాయి. అందులో భాగంగానే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2021లో బెంగళూరు–విజయవాడను కలిపే కొత్త ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించాలని భారత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అదే సంవత్సరం ఆగస్ట్ నెలలో ప్రణాళికను ఆమోదించింది. పనులు చురుగ్గా సాగుతున్నాయి. 2026 నాటికి హైవేపై వాహనాలు పరుగులు తీయనున్నాయి. బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు సమయంతోపాటు డబ్బు ఆదా కానున్నాయి. అంతేకాదు అద్దంకి పరిసర ప్రాంతాలు అభివృద్ధి బాట పట్టనున్నాయి.
అద్దంకి: అభివృద్ధిలో వైఎస్సార్ సీపీ ఏనాడూ వెనుకంజ వేయలేదనే సత్యం నేడు వెలుగులోకి వస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2021లో బెంగళూరు–విజయవాడను కలిపే కొత్త ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించాలని భారత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అదే సంవత్సరం ఆగస్ట్ నెలలో ప్రణాళికను ఆమోదించింది. దీంతో బెంగళూరు–విజయవాడ ఎక్స్‌ప్రెస్ గ్రీన్ ఫీల్డ్ హైవేకి శ్రీకారం చుట్టారు. 2024 మార్చిలో పనులు ప్రారంభమయ్యాయి. 2026–27 నాటికి ఆరు లైన్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి అందుబాటులోకి రానుంది. ఈ రహదారి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నుంచి బాపట్ల జిల్లాలోని ముప్పవరం వద్ద జాతీయ రహదారికి అనుసంధానం కానుంది. దీంతో అద్దంకి పరిసర గ్రామాలు, నియోజకవర్గలోని వివిధ గ్రామాల్లోని వారికి బెంగళూరు–విజయవాడ ప్రయాణ సమయం తక్కువ కానుంది. ఇప్పటికే నియోజకవర్గంలోని మండలాలను కలుపుతూ వెళ్తున్న కన్యాకుమారి–కొల్‌కత్తా జాతీయ రహదారి, అద్దంకి పట్టణం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలిపే అద్దంకి –నార్కెట్‌పల్లి, వైఎస్సార్ హయాంలో నిర్మించిన రాష్ట్రీయ రహదారులున్నాయి. ప్రస్తుత గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేతో తూర్పు–దక్షిణ భారతదేశం మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పడనుంది. బెంగ ళూరు నుంచి సత్యసాయి జిల్లాలోని కొడికొండ వద్ద మొదలై బాపట్ల జిల్లాలోని అద్దంకి వద్ద జాతీయ రహదారిలో కలుస్తుంది. బెంగళూరు నుంచి బాపట్ల జిల్లాలోని ముప్పవరం వరకు నిర్మించ నున్న గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే పనులు 14 ప్యాకేజీలుగా విభజించారు. అందులో మిగిలిన ప్యాకేజీలు ఇప్పటికే జరుగుతుండగా, ప్రకాశం జిల్లాలోని సోమవరప్పాడు నుంచి, అద్దంకి మండలం కొటికలపూడి, వేలమూరిపాడు, దక్షిణ అద్దంకి, ఉత్తర అద్దంకి, కలవకూరు, ముప్పవరం, జాగర్లమూడివారిపాలెం కొటికలపూడి గ్రామాల్లో 14 నంబరు ప్యాకేజీగా పనులు మొదలై చురుగ్గా సాగు తున్నాయి. దానిలో భాగంగా ఇక్కడ తొలుత కల్వర్టులు, పైప్‌లైన్లు, యుటిలిటీ పనులు చేస్తున్నారు.
గుండ్లకమ్మపై మరో వంతెన..
అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం గ్రామ సమీపంలో ఇప్పటికే గుండ్లకమ్మ నదిపై ఒక వంతెన 1981 నుంచి అందుబాటులో ఉండగా, సమీప గ్రామమైన కొటికలపూడి–వేలమూరిపాడు గ్రామాల మధ్య మరో వంతెన అందుబాటులోకి రానుంది. రూ.703 కోట్లతో ఈ వంతెన నిర్మాణానికి డ్రిల్లింగ్ చేసి పనులను ప్రారంభించారు.
నిర్మాణంలో వంతెన
రహదారి వివరాలు.
2021లో ప్రతిపాదనలు పంపిన
నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం
2023 నుంచే భూ సేకరణ
పనులకు శ్రీకారం
14 ప్యాకేజీలుగా రహదారి నిర్మాణం
అద్దంకి, ముప్పవరం
దగ్గర హైవేలోకి వాహన ప్రవేశాలు
2026కి అందుబాటులోకి రానున్న
గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే
ఈ రహదారి ఆరు లైన్లతో.. 14వ నంబరు ప్యాకేజీలో 28.64 కిలోమీటర్లు పొడవున నిర్మాణం కానుంది. ఈ రహదారి 70 మీటర్ల వెడల్పుతో నిర్మించనుండగా, రెండు వైపులా ప్లాంటేషన్, కొన్ని ప్రాంతాల్లో మినహా మధ్యలో డివైడర్, అద్దంకి, ముప్పవరం ప్రాంతాల్లో సర్వీస్ రోడ్లు నిర్మించనున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో మినహా మరెక్కడా వాహనాలకు ప్రవేశ ద్వారాలు ఉండవు. పట్టణంలోని ఒంగోలు రహదారిని క్రాస్ అయ్యే ప్రాంతంలో రెండు ఔటర్ రింగ్‌లు చిన్నచిన్న వాహనాలు పోవడానికి అవకాశం కల్పించనున్నారు. మిగిలిన చోట్ల రహదారి నుంచి క్రాస్ అయ్యే సమయంలో అండర్ పాస్‌లు నిర్మించనున్నారు. ఈ రహదారిలో 120 నుంచి 150 కిలోమీటర్ల వేగం ఉంటుందని అంచనా. దాంతో అద్దంకి పరిసర ప్రాంతాల్లో వ్యాపార, రవాణా, అత్యధిక దూరంలోని బెంగళూరు, విజయవాడ ప్రాంతాల మధ్య ప్రయాణం సమయం12 నుంచి 13 గంటలు తగ్గి 8 గంటల నుంచి 9 గంటల్లోకి రానుంది.