
పిల్లల సంరక్షణపై సర్టిఫికెట్ కోర్సు
గుంటూరు ఎడ్యుకేషన్: సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా కళాశాల హోంసైన్స్ విభాగంలో నానీ కేర్ అండ్ న్యూట్రీషన్ (పిల్లల సంరక్షణ)పై ఏడాది వ్యవధి గల సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌ను 2025–26 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వీఆర్ జ్యోత్స్నకుమారి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. న్యూట్రీషన్, చైల్డ్‌కేర్ స్కిల్స్‌లో ప్రత్యేక శిక్షణ అందిస్తామని చెప్పారు. చేరేందుకు ఆసక్తి కలిగిన పదో తరగతి, ఆపై విద్యార్హతలు ఉన్న వారు అడ్మిషన్ పొందవచ్చునని తెలిపారు. ఇతర వివరాలకు 90592 00037, 95420 32539 ఫోను నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
‘అక్షర ఆంధ్ర’ను విజయవంతం చేయాలి
వయోజన విద్యాశాఖ ఉపసంచాలకులు కె.ఆంజనేయులు
నరసరావుపేట: నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే ‘అక్షర ఆంధ్ర’ను సమర్థంగా నిర్వహించి విజయవంతం చేయాలని వయోజన విద్యాశాఖ ఉప సంచాలకులు కె.ఆంజనేయులు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నిరక్షరాస్యులైన మహిళలు, పురుషులకు చదవడం, రాయడం, చిన్న చిన్న లెక్కలు చేయడం నేర్పించాలని సూచించారు. డిజిటల్ లిటరసీ, ఫైనాన్సియల్ లిటరసీలను విజయవంతంగా అమలు చేసేందుకు కృషి చేయాలని చెప్పారు. జిల్లాలోని 1,27,565 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించిందని పేర్కొన్నారు. వివిధ శాఖల అధికారుల సహకారంతో ఆగస్టు ఏడో తేదీన అక్షరాస్యత కేంద్రాలు ప్రారంభించాలని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి నిరక్షరాస్యులకు విద్య నేర్పించి, ప్రభుత్వ లక్ష్యాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అదే మార్చిలో నిర్వహించే ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞాన మదింపు పరీక్ష నిర్వహణకు సంపూర్ణ సహాయ, సహకారాలు అందించాలని వివిధ శాఖల అధికారులను కోరారు. వయోజన విద్యాశాఖ తరఫున నిరక్షరాస్యులెన ప్రతి ఒక్కరికీ రెండు వాచకాలు, వర్క్ షీట్స్, దృశ్య శ్రవణ వీడియోలు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. వలంటీర్లను ఎంపిక చేసి ఒక్కొక్కరికీ పది మంది నిరక్షరాస్యులను అప్పగించాలని చెప్పారు. ఈనెల 26వ తేదీలోగా సమగ్రంగా నివేదికలు అందజేయాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ ఝాన్సీరాణి, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ డీపీఎం వీరాస్వామి, ఐసీడీఎస్ పీడీ అరుణ, డీఈవో చంద్రకళ, జీఎస్‌డబ్ల్యూఎస్ వెంకట్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.రవి, డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి పాల్గొన్నారు.

పిల్లల సంరక్షణపై సర్టిఫికెట్ కోర్సు