
దళిత ఉద్యమాలకు స్ఫూర్తి కారంచేడు
చీరాలరూరల్: దేశవ్యాప్త దళిత ఉద్యమాలకు కారంచేడు ఉద్యమం స్ఫూర్తి నింపడమే కాక దళితుల ఆత్మగౌరవాన్ని పెంపొందించిందని పలువురు దళిత, బహుజన నేతలు, ప్రజాసంఘాల నాయకులు పేర్కొన్నారు. కారంచేడు గ్రామంలో మారణకాండకు నేటితో 40 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం మండల పరిధిలోని విజయనగర్ కాలనీలోని కారంచేడు మృతవీరుల రుధిర క్షేత్రం వద్ద సంస్మరణ సభ నిర్వహించి మృతవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో పలువురు వక్తలు మాట్లాడా రు. దేశానికి స్వాతంత్య్ర పోరాటం ఎలాంటిదో.. కారంచేడు ఉద్యమ పోరాటం కూడా అటువంటిదన్నారు. ఈ ఉద్యమం ఎంతోమంది దళితులు నా యకులుగా ఎదగటానికి దోహదపడిందని అ న్నారు. వారి ప్రాణ త్యాగాలు మరువలేనివన్నారు. పెత్తందారుల అక్రమాలు, ఆగడాలు, దౌర్జన్యాలను అరికట్టడానికి ఆయుధంగా కారంచేడు ఉద్యమం ఉపయోగపడిందని వక్తలు పేర్కొన్నారు. అంతేకాక మృతవీరుల మరణం ఎంతోమంది సామాజిక ఉద్యమకారులలో స్ఫూర్తిని నింపి ఆత్మగౌరవ ఉద్యమాలు కొనసాగించటానికి కారణభూతమైందన్నారు. కారంచేడు మృతవీరుల రుధిర క్షేత్రాన్ని సందర్మించి వారికి నివాళులర్పించడం పౌరులుగా సామాజిక బాధ్యత అని వారు పేర్కొన్నారు. కారంచేడు ఉద్యమ సీనియర్ నాయకుడు దుడ్డు భాస్కరరావు అధ్యక్షత వహించిన సభలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు, ఆలిండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్క పరంజ్యోతి, వీకేసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌జే విద్యాసాగర్, బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే ఎల్‌కే రాజారావు, ఏపీ లిడ్‌క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, బైరి నరేష్, తేళ్ల సుబ్బారావు, తేళ్ల లక్ష్మీప్రసాద్, దుడ్డు ఏసు, మున్నంగి లక్ష్మయ్య, గోసాల ఆశీర్వాదం, నీలం నాగేంద్రరావు పాల్గొన్నారు.
కారంచేడు మృతవీరుల సంస్మరణ సభలో నేతలు