
బాపట్ల జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం
బాపట్ల: బాపట్ల జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో శనివారం నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి పేర్కొన్నారు. ఈ నిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు విస్తృత ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. శనివారం బాపట్ల మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డులో భారీ అవగాహన సదస్సు, ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కార్యక్రమంలో వెయ్యి మంది విద్యార్థులు, మరో వెయ్యి మంది అధికారులు, ప్రజలు పాల్గొని ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేస్తారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులైన ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు, క్యారీ బ్యాగులు, స్ట్రాలు వంటి వాటిపై పూర్తి నిషేధం విధించినట్లు తెలిపారు. వ్యాపారులు, దుకాణదారులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని ఆయన ఆదేశించారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను అమ్మినా, కొన్నా క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నిషేధం జిల్లాలోని 4 మున్సిపాలిటీలు, 25 మండలాల్లో పటిష్టంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు దీర్ఘకాలంగా ఉపయోగపడే వస్తువులను వాడాలని, ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పాడైన ప్లాస్టిక్‌ను సేకరించి రీసైకిల్ చేయాలని, తద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు. ప్లాస్టిక్ రహిత వస్తువులను వినియోగించడాన్ని ప్రోత్సహించాలని, ప్రత్యామ్నాయంగా అరటి నారు, జనపనార, బాదం ఆకులు, వస్త్రపు సంచుల ను వాడాలని సూచించారు. డ్వాక్రా మహిళలు, ఎస్.ఎస్.జి. సభ్యుల నుంచి ప్లాస్టిక్ రహిత వస్తువుల తయారీకి ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సా హం అందిస్తుందని పేర్కొన్నారు. ఈ సమగ్ర నిషేధం ద్వారా బాపట్ల జిల్లాలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించి, స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
రేపటి నుంచి అమలు జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి