
వైఎస్సార్ సీపీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోం
బాపట్ల టౌన్: వైఎస్సార్ సీపీ కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున అన్నారు. జిల్లాలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై బనాయించిన అక్రమ కేసులపై పునఃపరిశీలన చేయాలని కోరుతూ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున, నియోజకవర్గాల సమన్వయకర్తలు కోన రఘుపతి, వరికూటి అశోక్‌బాబు, ఈవూరి గణేష్‌తోపాటు పలువురు నాయకులతో కలిసి ఎస్పీ తుషార్ డూడీకి గురువారం వినతి పత్రం అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడారు. రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతుందన్నారు. వైఎస్సార్ సీపీ లా అండ్ ఆర్డర్‌కు పూర్తిగా సహకరిస్తుందని, అయితే కొంతమంది అధికారులు నాయకుల మెప్పు పొందేందుకు వన్‌సైడ్‌గా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అధికారం ఎప్పుడు ఒకరి వద్దనే ఉంటుందని భావించవద్దని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీలో పని చేస్తున్న బలమైన నాయకులు, కార్యకర్తలపై సంబంధంలేని కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వివరించారు. కరోనా సమయంలో 68 మంది రేపల్లె ప్రాంతంలో చనిపోతే మృతదేహాలను ఖననం చేసిన ఒక నాయకుడిపై అక్రమ కేసులు బనాయించటం ఎంత వరకు న్యాయమో వారే ఆలోచించాలన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల అండతో పేట్రేగిపోతున్న కొంతమంది ఆగడాలు తగ్గించుకోవాలని సూచించారు.
అత్యుత్సాహం మానుకోవాలి: కోన
నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు కొంతమంది కిందిస్థాయి పోలీసు అధికారులు మరింత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ పలు కేసులకు సంబంధించి ఏవిధంగా అక్రమ కేసులు బనాయించారనేది స్పష్టంగా వివరించామని తెలిపారు. ఈ విషయాలపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో వైఎస్సార్ సీపీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, జోగి రాజా, కోకి రాఘవరెడ్డి తదితరులు ఉన్నారు.
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది కొంతమంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అక్రమ కేసులపై పునఃపరిశీలన చేయాలి అధికారం శాశ్వతం కాదు వైఎస్సార్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున