తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధం

- - Sakshi

తెనాలి: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మిచాంగ్‌ తుఫాన్‌గా మారింది. మంగళవారం ఉదయం బాపట్ల సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నందున కురిసే భారీ వర్షాలు, వీచే గాలులకు తెనాలి డివిజనులో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు తెనాలి సబ్‌కలెక్టర్‌ గీతాంజలి శర్మ వెల్లడించారు. అన్ని ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకుంటూ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా తగిన జాగ్రత్తలతో ఉండాలని తెలియజేశారు. స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సబ్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ మాట్లాడారు. మిచాంగ్‌ తుఫాన్‌ ముంచుకొస్తున్న తరుణంలో ప్రభుత్వపరంగా అన్నిరకాల చర్యలు చేపట్టామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల ప్రకారం ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు చెప్పారు. ఆరోగ్యశాఖ, మున్సిపాలిటీ యంత్రాంగం, పోలీస్‌శాఖ, ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌, అగ్నిమాపక విభాగాలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు. అన్ని విభాగాల వారు ఇప్పటికే అప్రమత్తంగా ఉన్నారని చెప్పారు. పొరుగు జిల్లా కేంద్రం బాపట్ల సమీపంలో తుఫాన్‌ తీరం దాటే అవకాశం ఉన్నందున ఇక్కడ సైతం భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు, రైతులు అధికారుల సూచనలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో హెల్ప్‌ డెస్క్‌, కంట్రోలు రూమ్‌ను ఏర్పాటుచేశామని చెప్పారు. ప్రజలు ఎవరికై నా సమస్య ఏర్పడితే 9866671291 కంట్రోలు రూమ్‌ నంబరును సంప్రదించాలని సబ్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ సూచించారు.

ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చూడాలి అధికారులకు తెనాలి సబ్‌కలెక్టర్‌ గీతాంజలి శర్మ సూచన

Read latest Bapatla News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top