హామీలకు ఎగనామం పెట్టి అమలు చేసేసినట్లు చంద్రబాబు గప్పాలు
జాబులు లేకుండా జాబ్ క్యాలెండర్ ఇచ్చి లక్షల ఉద్యోగాలిచ్చినట్లు ప్రచారం
రాజధాని రైతులను నట్టేట ముంచి పైకి మాత్రం వారు త్యాగమూర్తులని కితాబు
ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి ఇప్పుడు యుగ పురుషుడంటూ కీర్తన
వైఎస్ జగన్‌పై విషం కక్కుతూ వీడియో ప్రదర్శన
సాక్షి, అమరావతి : కళ్లార్పకుండా అలవోకగా అబద్ధాలు, అభూత కల్పనలతో ప్రజలను నిరంతరం వంచించడంలో నిష్ణాతుడైన చంద్రబాబు టీడీపీ ఆవిర్భావ సభలోనూ అదే ఒరవడిని కొనసాగించారు. చెప్పిన అబద్ధాలనే మళ్లీ మళ్లీ చెబుతూ, వాటినే నిజాలనుకునేలా ప్రజలను భ్రమలో ఉంచేందుకు ఆదివారం నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి వేదికగా చేసుకున్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలుచేయకుండానే వాటిని సూపర్‌హిట్ చేసేశామని ప్రజల కళ్లకు గంతలు కట్టేందుకు ప్రయత్నించారు. ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలుచేయకుండానే అమలుచేసి చూపించామని గొప్పలు చెప్పుకోవడం ఆయన అసత్యాలకు పరాకాష్ట. అలాగే..
» మహాశక్తి పథకం కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500.. యువగళం పేరుతో 20 లక్షల ఉద్యోగాల కల్పన లేకపోతే రూ.3 వేల నిరుద్యోగ భృతి ఊసేలేకుండానే 21 నెలల పాలన పూర్తిచేశారు. అయినా నిస్సిగ్గుగా వాటి ఊసేలేకుండా వాటిని అమలుచేసేసినట్లు ప్రకటించుకున్నారు.
» అన్నదాత పథకం కింద ఏడాదికి ప్రతి రైతులకు రూ.20 వేలు ఇస్తామని చెప్పి అరకొరగా కొంత విదిల్చి దాన్ని అమలుచేసినట్లు డబ్బా కొట్టుకున్నారు.
» దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకాలను కంటితుడుపుగా ఏదో చేశామన్నట్లు చేసి వాటిని కూడా చేసేసినట్లు బిల్డప్ ఇచ్చారు.
» సూపర్‌సిక్స్‌తో కలిపి 143 హామీలిచ్చిన చంద్రబాబు అందులో ఏ ఒక్క హామీని సరిగ్గా అమలుచేయకుండానే సూపర్‌హిట్ చేశామని చెప్పుకున్నారు.
» జాబులు లేకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, 6.25 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించుకోవడాన్ని బట్టి తాను ఏది చెప్పినా ప్రజలు అమాయకంగా నమ్మడం తప్ప మరో మార్గంలేదని చాటుకున్నారు.
రాజధాని రైతులపై కపట ప్రేమ..
మరోవైపు.. రాజధాని రైతులను అన్ని విధాలా దెబ్బతీసి ఇప్పుడు వారి త్యాగాలు వృ«థా కావని చెబుతూ.. ఇంకా వారిని మోసంచేస్తూ.. ఇకపై కూడా మోసంచేస్తూనే ఉంటానని చెప్పకనే చెప్పడం గమనార్హం. పుష్కరకాలం క్రితం భూసమీకరణకు 34 వేల ఎకరాల భూములిచ్చిన రైతులకు ఇంతవరకూ ప్లాట్లు ఇవ్వకపోవడంతో వారి ఆందోళన వర్ణనాతీతం.
వారికింకా ప్లాట్లు ఇవ్వకుండా, ఆ ప్లాట్లకు సంబంధించిన లేఅవుట్ల గురించి పట్టించుకోకుండా మళ్లీ రెండు, మూడు విడతల్లో భూములు తీసుకుంటామని ప్రకటించి రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. భూములిచ్చిన రైతులను పట్టించుకోకుండా కార్పొరేట్ కంపెనీలకు మాత్రం వందల ఎకరాల భూములను కట్టబెడుతుండడంతో వారు లబోదిబోమంటున్నారు. ఒకవైపు ఇప్పటికీ వారి భూములను బలవంతంగా లాక్కుంటూ.. పైకి వారు స్వచ్ఛందంగా ఇస్తున్నారనే మాయమాటలతో రైతులను వంచించేందుకు యత్నించడంపై రైతులు రగిలిపోతున్నారు.
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి...
పిల్లనిచ్చిన సొంత మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. ఆయన్నుంచి సీఎం పదవిని, తెలుగుదేశం పార్టీని లాక్కున్న విషయాన్ని మరచిపోయి 44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలోనూ ఎప్పటిలానే ఆయన్ను అవతార పురుషుడిగా కీర్తించారు. తాను చేసిన దారుణమైన మోసాన్ని భరించలేక ఎన్టీఆర్ మానసిక క్షోభతో చనిపోయిన విషయాన్ని కూడా మరిపిస్తూ పార్టీ మొత్తాన్ని తన కబంధ హస్తాల్లోకి తీసుకుని ఇప్పుడాయన గొప్పవాడంటూ చేస్తున్న ప్రసంగాలు, ఆడుతున్న డ్రామాలు ఎన్టీఆర్ అభిమానులను తీవ్రంగా కలచివేస్తున్నాయి. చనిపోయిన ఎన్టీఆర్ ఆత్మను కూడా వదలకుండా చంద్రబాబు ఆయన్ను వేధిస్తున్నారని ఎన్టీఆర్ నిజమైన అభిమానులు బాధపడుతున్నారు.
వైఎస్ జగన్‌పై మళ్లీ విషం..
మరోవైపు.. వైఎస్ జగన్‌పై ఎప్పటిమాదిరిగానే ఈ సభలోనూ చంద్రబాబు విషం కక్కారు. 2019–24లో ఇష్టం వచి్చనట్లు చెప్పిన అబద్ధాలు, విష ప్రచారాలు, దొంగ వ్యవహారాలనే వీడియో చేసి ప్రదర్శించారు. అలాగే, సొంత కుటుంబసభ్యుల వేధింపులతో టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుంటే జగన్‌వల్లే ఆయన చనిపోయాడని చూపించి ప్రజలను అదేపనిగా తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారు. ఇలా ఆవిర్భావ సభ ఆసాంతం ప్రజలను వంచించే అబద్ధాలు, ఎన్టీఆర్‌కు దొంగ నమస్కారాలు, తనకు సంబంధంలేని వాటిని తన గొప్పలుగా చెప్పుకుని సొంత డబ్బా కొట్టుకున్నారు.


