మదనపల్లె సిటీ : పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత చదువుల వేదికలుగా నిలవాల్సిన ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థ జిల్లాలో పూర్తిగా కుప్పకూలిపోయింది. ‘అందరికీ నాణ్యమైన ఉచిత విద్య అందిస్తాం’ అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విద్యావ్యవస్థను గాలికొదిలేసింది. కొత్త నియామకాలు చేపట్టకపోగా, ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తుండటంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు రెగ్యులర్ అధ్యాపకులు లేక వెలవెలబోతున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలకు దీటుగా ఫలితాలు సాధించాల్సిన ప్రభుత్వ సంస్థలు నేడు కేవలం కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్ల భరోసాతోనే అరకొరగా నడుస్తున్నాయి. దీంతో సర్కారు కాలేజీలను నమ్ముకున్న వేలాది మంది గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారింది.
ఉన్నత విద్యకు తిలోదకాలు!
కూటమి ప్రభుత్వం పేదల చదువుకు పాతరేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు శాశ్వత ప్రాతిపదికన బోధనా సిబ్బందిని నియమించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ, ఆ దిశగా సర్కారు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ అధ్యాపకుల సంఖ్య ఏటా పడిపోతోంది. పదవీ విరమణ చేసిన వారి స్థానాల్లో కొత్త వారిని నియమించకపోవడంతో విద్యా ప్రమాణాలు దిగజారుతున్నాయి. ప్రైవేట్ కాలేజీల దోపిడీని అడ్డుకోవాల్సింది పోయి, ప్రభుత్వ కాలేజీలను నిర్వీర్యం చేయడం ద్వారా కార్పొరేట్ శక్తులకు కూటమి సర్కారు పరోక్షంగా కొమ్ముకాస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి.
జిల్లా వ్యాప్తంగా 22 ప్రభుత్వ జూనియర్ కాలేజీలతో పాటు ఒక ఎయిడెడ్ కాలేజీ ఉంది. ఈ విద్యాసంవత్సరంలో మొదటి సంవత్సరంలో 2,766 మంది, ద్వితీయ సంవత్సరంలో 2,619 మంది చొప్పున మొత్తం 5,385 మంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు జిల్లా మొత్తంలో ఉన్నది కేవలం 50 మంది రెగ్యులర్ అధ్యాపకులు మాత్రమే!
లక్షల జీతాలు తప్పించుకునే ఎత్తుగడ : రెగ్యులర్ లెక్చరర్లను నియమిస్తే వారికి నిబంధనల ప్రకారం ఐదో అంకె, ఆరో అంకెల్లో భారీగా జీతాలు, ఇతర అలవెన్సులు చెల్లించాల్సి వస్తుంది. ఈ ఖర్చును తప్పించుకునేందుకు ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది.
అరకొర వేతనాలతో వెట్టిచాకిరీ : రెగ్యులర్ పోస్టులను ఖాళీగా పెట్టి, వాటి స్థానంలో జిల్లా వ్యాప్తంగా 190 మంది కాంట్రాక్టు అధ్యాపకులను, 75 మంది గెస్ట్ లెక్చరర్లను నియమించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. కాంట్రాక్టు లెక్చరర్లకు రూ.57,100, గెస్టు లెక్చరర్లకు కేవలం రూ.27,660 వేతనాన్ని ఇస్తూ కాలం నెట్టుకొస్తున్నారు. వీరు ఎంత బాగా బోధించినప్పటికీ, ఉద్యోగ భద్రత లేకపోవడం, మానసిక ఆందోళన వల్ల పూర్తిస్థాయిలో విద్యాబోధనపై దృష్టి పెట్టలేకపోతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి.
వ్యాయామ విద్యకు పాతర..
కేవలం చదువు మాత్రమే కాకుండా విద్యార్థులకు శారీరక, మానసిక దృఢత్వాన్ని ఇచ్చే క్రీడలను, వ్యాయామ విద్యను కూటమి ప్రభుత్వం సమాధి చేసింది.సాధారణంగా ఇంటర్ విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రతి కాలేజీకి ఒక ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) ఉండాలి. కానీ జిల్లాలోని 22 కాలేజీలకు గాను కేవలం మదనపల్లె ప్రభుత్వ కాలేజీలో తప్ప ఎక్కడా పీడీ పోస్టు లేదు. మిగిలిన 21 కాలేజీల్లో క్రీడా పోటీలు, వ్యాయామం అనే ముచ్చటే లేకుండా పోయింది.
క్రీడాకారుల ఆశలు అడియాసలు
పాఠశాల (స్కూల్) స్థాయిలో ఆటల్లో బాగా రాణించి,పతకాలు సాధించిన ఎందరో క్రీడాకారులు కాలేజీ మెట్లు ఎక్కేసరికి ఆటలకు పూర్తిగా దూరమవుతున్నారు. వారిని గైడ్ చేసే నాథుడే కరువయ్యాడు.
ఇవన్నీ చాలవన్నట్లు, ఇటీవల కూటమి ప్రభుత్వం పీడీ పోస్టులను లెక్చరర్ పోస్టులుగా కన్వర్షన్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయంపై క్రీడా సంఘాలు, విద్యార్థి లోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ కాలేజీల్లో వ్యాయామ విద్యను శాశ్వతంగా నిర్వీర్యం చేయడానికే ఈ కుట్ర అని మండిపడుతున్నారు.
కూటమి సర్కారులో అధ్వాన్నంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు
రెగ్యులర్ అధ్యాపకుల కొరత తీవ్రం.. అంతా ‘తాత్కాలిక’ ముచ్చటే!
కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్లతో నెట్టుకొస్తున్న వైనం
బోధనకు ఎలాంటి ఆటంకం లేదు
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యాబోధనకు ఎలాంటి ఇబ్బంది లేదు. రెగ్యులర్ లెక్చరర్ల కొరత ఉన్న మాట వాస్తవమే అయినా, విద్యార్థులకు నష్టం జరగకుండా కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్లతో క్లాసులు సజావుగా సాగిస్తున్నాం. అందరికీ నాణ్యమైన విద్య అందుతోంది. రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు, వంద శాతం ఉత్తీర్ణత సాధించడం కోసం ప్రతి కాలేజీలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం.
–రవి, జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి


