● ఇక మిగిలింది రెండేళ్లే..
● వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే
● అక్రమ కేసులకు భయపడొద్దు
● ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి
రాజంపేట : అధికారం అండతో ఈ రోజు విర్రవీగుతున్న వారికి ఒకటే చెబుతున్నామని, ఈ ప్రభుత్వానికి మిగిలింది కేవలం రెండేళ్ల కాలం మాత్రమేనని రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి హెచ్చరించారు. వచ్చేది మన ప్రభుత్వమేనని, ఆ రోజు వీరంతా ఎక్కడ పోయి దాక్కుంటారని ఆయన ఎద్దేవా చేశారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి అధ్యక్షతన ఆకేపాటి ఎస్టేట్‌లోని సభాభవనంలో నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎంపీ మిథున్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని అహంకారంతో ప్రవర్తిస్తే, ఆ తర్వాత ఐదేళ్లు వారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల వేళ అనవసరంగా రాద్ధాంతాలు చేస్తూ, గొడవలకు దిగితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో గత ఐదేళ్ల పాటు అందరూ సామరస్యంగా ఉన్నారని, ఎక్కడా కక్షసాధింపులు జరగలేదని గుర్తుచేశారు. గణేష్ నిమజ్జనం పర్వదినం తర్వాత కొందరు కావాలనే తమ ఇంటి ముందు డీజేలు పెట్టి, పోలీసు బందోబస్తు మధ్య దూషిస్తూ అవమానకరంగా ప్రవర్తించారని మండిపడ్డారు. తాము గనుక ఆ రోజు దృష్టి పెట్టి ఉంటే రాష్ట్రంలో ఈ రోజు వారు ఉండే వారా అని ప్రశ్నించారు.
కార్యకర్తలకు కొండంత అండ
పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, న్యాయపరంగా వైఎస్సార్‌సీపీ పూర్తి వకాల్తా పుచ్చుకుని కేసులను నడిపిస్తుందని ఎంపీ భరోసా ఇచ్చారు. కార్యకర్తలకు ఎలాంటి నష్టం జరిగినా.. దాన్ని నా సొంత నష్టంగా భావించి అండగా ఉంటానని ప్రకటించారు. తాను ఎంపీగా ఉన్నానంటే దానికి కారణం ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి అని అన్నారు. అలాగే రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డికి ఎల్లప్పుడూ సాయం చేసే గుణం ఉందని కొనియాడారు. పార్టీలో ఎలాంటి వర్గాలు లేవని, ఇక్కడ ఉన్నదల్లా ఒకే ఒక్క ’జగనన్న వర్గం’.. అది ’వైఎస్సార్‌సీపీ’ మాత్రమేనని స్పష్టం చేశారు.
రాజంపేటపై చంద్రబాబు కక్ష
గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించారనే కక్షతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజంపేట నియోజకవర్గంపై కక్షగట్టారని, ఆ విషయాన్ని వారి పార్టీ నేతలే స్వయంగా చెప్పుకొంటున్నారని మిథున్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు కూటమి అధికారంలోకి వస్తే చెయ్యేరు ప్రాజెక్టు పూర్తి చేసి నీటి సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చి, తీరా గెలిచాక గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలను, టెండర్లను రద్దు చేయడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. వైఎస్సార్‌సీపీని గెలిపించి మళ్లీ మా దగ్గరికే నిధుల కోసం వస్తున్నారా అంటూ చంద్రబాబు హేళనగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఖజానాలోని డబ్బునంతా చంద్రబాబు తన భూముల చుట్టూ ఉన్న అమరావతికే కేటాయిస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో చదరపు అడుగుకు రూ.2 వేల విలువైన కాంట్రాక్టు పనులను రూ.20 వేలకు కట్టబెడుతూ భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అక్కడ నీళ్లు తోడిపోసేందుకు వృథా చేస్తున్న నిధులను అన్నమయ్య డ్యామ్‌కు కేటాయిస్తే ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. సామాన్య ప్రజల కోసం రూ.2 కోట్లు ఇవ్వాలంటే వందసార్లు ఆలోచించే ఈ ప్రభుత్వం, అమరావతిలో మాత్రం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా తగలేస్తోందని విమర్శించారు. గతంలో వైఎస్ జగన్‌మోన్‌రెడ్డి ఇచ్చిన హామీలైన మెడికల్ కాలేజీ, చెయ్యేరు ప్రాజెక్టుతోపాటు అన్ని హామీలను మళ్లీ జగనన్న ప్రభుత్వం రాగానే నెరవేరుస్తామని స్పష్టం చేశారు. రాజంపేట, కడప పార్లమెంట్ పరిశీలకులు సురేష్‌బాబు, అజయ్‌రెడ్డి మాట్లాడారు. రాజంపేట పరిశీలకులు దేవనాథరెడ్డి, రాజంపేట ఇన్‌చార్జి ఆకేపాటి అనిల్‌రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి, ఏఐటీఎస్ వైస్ చైర్మన్ చొప్పాఎల్లారెడ్డి, వైఎస్సార్‌సీపీ మహిళ ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరీరెడ్డి, వివిధ మండలాల పార్టీ కన్వీనర్లు గోపిరెడ్డి, టక్కోలు శివారెడ్డి, మణిరాజు, రామస్వామిరెడ్డి, నీలకంఠారెడ్డి, భాస్కరరాజు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ కంచుకోటగా నిరూపించాలి
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేయాలి. నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా శ్రమించి పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి. రాజంపేట అంటే వైఎస్సార్‌సీపీ కంచుకోట అని మరోసారి నిరూపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.
ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, ఎమ్మెల్యే, రాజంపేట
వెన్నుదన్నుగా ఉంటాం
రాజంపేట నియోజకవర్గంలోని మున్సిపాలిటీతోపాటు ఆరు మండలాల్లోనూ వైఎస్సార్‌సీపీ సత్తా చాటాలి. పార్టీ శ్రేణులందరికీ నేను, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డి ఎల్లప్పుడూ అండగా ఉంటాం. కార్యకర్తలు, నాయకులు చిత్తశుద్ధితో పని చేయాలి, పార్టీ మీకు వెనుదన్నుగా నిలుస్తుంది.
మేడా రఘునాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడు


