గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లెగ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లికి భక్తులు వెండికిరీటాన్ని బహూకరించారు. తిరుపతి జిల్లా భాకరాపేట గ్రామానికి చెందిన రెడ్డెప్పరెడ్డి, దీప్తి దంపతులు ఆదివారం 315 గ్రాముల వెండి కిరీటాన్ని ఆలయ కమిటీ చైర్మన్ రాజన్న నాయుడు, ఈవో మంజులకు అందజేశారు. ఈసందర్భంగా అర్చకులు దాతలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలను ఆందజేసారు. అనంతరం వారిని సన్మానించారు.
ఆలయానికి రూ. 25 వేలు విరాళం
శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయ అభివృద్ధికి కలికిరి మండలం మేడికుర్తికి చెందిన రెడ్డిరాణీ, భార్గవ దంపతులు రూ. 25 వేలు విరళాంగా అందజేశారు. ఆదివారం ఆలయానికి చేరుకున్న వీరు రూ. 25 వేలు ఆలయకమిటీ చైర్మన్ రాజన్న నాయుడు, ఈవోమంజులకు అందజేశారు. ఈమొత్తాన్ని వాల్మీకీపురం ఆంధ్రా ప్రగతి గ్రామీణబ్యాంకులో జమ చేయనున్నట్లు ఈవో పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది బాలకృష్ణ, మహేష్, వెంకటరమణ తదితరులు పాల్గోన్నారు.
గాలివీడు రామాలయానికి పిడుగుపాటు
గాలివీడు : అన్నమయ్య జిల్లా గాలివీడు మండల కేంద్రంలో ఆదివారం స్థానిక గేటు సమీపంలో వెలసిన శ్రీరామాలయ ధ్వజస్తంభంపై పిడుగు పడింది. పిడుగుపడిన తీవ్రతకు ఆలయ ధ్వజస్తంభం కింది భాగంలోని రాతి దిమ్మె పాక్షికంగా దెబ్బతింది, ఆదివారం కావడంతో ఆలయంలో పూజల కోసం భక్తులు లేని సమయంలో ఈ ఘటన జరిగింది. పిడుగు పడిన క్షణంలో భారీ శబ్దం రావడంతో ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులు, స్థానిక నివాసితులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే, ఈ ప్రమాదంలో గర్భాలయానికి కానీ, ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులకు కానీ ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ధ్వజస్తంభం పిడుగుపాటుకు గురికావడంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు. దేవదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ వారు తక్షణమే స్పందించి దెబ్బతిన్న ధ్వజస్తంభానికి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.
మిట్స్‌కు అంతర్జాతీయ గుర్తింపు
కురబలకోట : అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీకి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచ ప్రఖ్యాత టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్‌ఈ) వరల్డ్ యూనివర్సిటీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్–27లో మిట్స్ 1401–1600 ర్యాంకింగ్ బ్యాండ్‌లో స్థానం సాధించినట్లు యూనివర్సిటీ ఫౌండర్, చాన్స్‌లర్ డాక్టర్ ఎన్. విజయభాస్కర్ చౌదరి తెలిపారు. భోధన పరిశోధన, నాణ్యత,పరిశ్రమ అనుసంధానం, అంతర్జాతీయ దృకధం వంటి అంశాల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ప్రకటిస్తారన్నారు. విద్యార్థులు ప్రపంచ స్థాయి అవకాశాలు పొందేలా అంతర్జాతీయ ప్రమాణాలను బలోపేతం చేస్తామని తెలిపారు. ప్రొ చాన్స్‌లర్ ఎన్. ద్వారకనాఽథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదేళ్ల తదితరులు హర్షం వ్యక్తం చేశారు.


