● యథేచ్ఛగా సెల్‌ఫోన్ల చోరీలు
● హడలెత్తిపోతున్న జనం
● కొరవడిన పోలీసు నిఘా
గుర్రంకొండ: మండల కేంద్రమైన గుర్రంకొండలో ప్రతి శుక్రవారం జరిగే వారపు సంత ఇప్పుడు దొంగలకు అడ్డాగా మారింది. గత రెండు నెలలుగా ఇక్కడ వరుసగా జరుగుతున్న సెల్‌ఫోన్ల చోరీలతో అటు వ్యాపారులు, ఇటు ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అన్నమయ్య జిల్లాతో పాటు పక్కనే ఉన్న చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల నుంచి కూడా వేలాది మంది వ్యాపారులు, కొనుగోలుదారులు ఇక్కడికి వస్తుండడంతో సంత ఎప్పుడూ కిక్కిరిసిపోతుంటుంది. జనాల రద్దీని ఆసరాగా చేసుకుంటున్న కేటుగాళ్లు.. గుట్టుచప్పుడు కాకుండా జేబులు కత్తిరిస్తున్నారు.
వారాల వారీగా.. పెరిగిన చోరీలు
సంతలో దొంగల ముఠాలు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నాయో ఈ గణాంకాలే చెప్తున్నాయి. మొదటి వారం 4 రెండో వారం: 6, మూడో వారం 7ౖ ఇటీవలి శుక్రవారం: ఏకంగా ఎనిమిది మంది సెల్‌ఫోన్లు అపహరణకు గురయ్యాయి. ఇప్పటివరకు దాదాపు రూ. 6 లక్షల విలువైన స్మార్ట్‌ఫోన్లు దొంగల పాలైనట్లు తెలుస్తోంది. సాధారణ భక్తులు, కూరగాయలు కొనే కస్టమర్లలా నటిస్తూ జనాల్లో కలిసిపోతున్న దొంగలు.. క్షణాల్లో పని కానిచ్చేస్తున్నారు.
బయటి ప్రాంతాల ముఠాల పనేనా?
కదిరి, మదనపల్లె ప్రాంతాలకు చెందిన ప్రత్యేక మొబైల్ స్నాచింగ్ ముఠాలు బృందాలుగా ఇక్కడికి వస్తున్నట్లు సమాచారం. ద్విచక్ర వాహనాలపై వచ్చే ఈ దొంగలు, వాటిని సంతకు కాస్త దూరంలో సిద్ధంగా ఉంచుకుంటారు. ప్రజల రద్దీ పీక్ స్టేజ్‌లో ఉండే మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 4:00 గంటల మధ్యనే వీరు ఎక్కువగా హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు. ఫోన్ కొట్టేయడమే ఆలస్యం.. బైక్‌లపై క్షణాల్లో అక్కడి నుంచి పరారవుతున్నారు. గతంలో ఓసారి ఇలాగే ఫోన్ దొంగిలిస్తూ దొరికిన ఓ దొంగకు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన కూడా ఉంది.
కొరవడిన నిఘా
వేలాది మంది వచ్చే ఈ భారీ సంతలో భద్రత గాల్లో దీపమైంది. కనీసం ముగ్గురు, నలుగురు పోలీసులు నిరంతరం పహారా కాయాల్సి ఉండగా.. ఇక్కడ పరిస్థితి వేరేలా ఉంది. ఒకరిద్దరు పోలీసులు ఉదయం 10 గంటల ప్రాంతంలో వచ్చి, తాము విధుల్లో ఉన్నట్లు ఫోన్లలో ఫొటోలు దిగి యాప్‌లలో అప్‌లోడ్ చేసి చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో బాధితులు ఫిర్యాదులు చేసినా పెద్దగా పురోగతి లేకపోవడంతో దొంగలు మరింత రెచ్చిపోతున్నారు.
గట్టి నిఘా పెడతాం
గుర్రంకొండ వారపు సంతలో పోలీస్ నిఘాను మరింత పెంచుతాం. దొంగతనాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచి, త్వరలోనే ఆ ముఠాను పట్టుకుంటాం. అయితే ప్రజలు కూడా కాస్త అప్రమత్తంగా ఉండాలి. అంత రద్దీగా ఉండే ప్రాంతాలకు ఖరీదైన ఫోన్లు జాగ్రత్తగా చూసుకోవాలి.
– రవీంద్రబాబు, ఎస్‌ఐ, గుర్రంకొండ
రెండేళ్లలో రెండు ఫోన్లు పోయాయి!
గత శుక్రవారం మా గ్రామం నుంచి గుర్రంకొండ సంతకు వచ్చాను. కూరగాయలు కొన్నాక జేబు చూసుకుంటే రూ. 36 వేల విలువైన ఫోన్ కనిపించలేదు. ఎక్కడ వెతికినా దొరకలేదు. పోయిన ఏడాది కూడా ఇదే నెలలో ఇలాగే రూ. 26 వేల ఫోన్ పోయింది. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.
– కదిరప్ప, ప్యారంపల్లె, బాధితుడు


