యువకుడిపై వరకట్న వేధింపుల కేసు | - | Sakshi
Sakshi News home page

యువకుడిపై వరకట్న వేధింపుల కేసు

Oct 5 2026 1:39 AM | Updated on Oct 5 2026 1:39 AM

యువకుడిపై వరకట్న వేధింపుల కేసు అదృశ్యమైన యువకుడు మృతి రైతుపై కత్తితో దాడి

మదనపల్లె టౌన్‌: భార్యను అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్న యువకుడిపై మదనపల్లె తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి సీఐ మహమ్మద్‌ రఫీ తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లె మండలంలోని వలస పల్లె పంచాయతీ, నవోదయ కాలనీలో నివాసం ఉంటున్న విజయలక్ష్మికి పదేళ్ల క్రితం వలసపల్లెకు చెందిన యశ్వంత్‌ తో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడు, ఏడేళ్ల కుమార్తె ఉంది. ప్రైవేట్‌ వాహన డ్రైవర్‌ గా పనిచేస్తున్న యశ్వంత్‌ తన భార్య విజయలక్ష్మిని అదనపు కట్నం కోసం గత కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తుండడంతో బాధితురాలు శనివారం రాత్రి తాలూకా పోలీసులను ఆశ్రయించింది. విచారణ అనంతరం సీఐ మహమ్మద్‌ రఫీ యశ్వంత్‌పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినట్లు తెలిపారు

పెద్దతిప్పసముద్రం : మండలంలోని కందుకూరుకు చెందిన డేగల శంకర్‌ కుమారుడు నరేంద్ర (23) గత నాలుగు రోజుల కిందట అదృశ్యమయ్యాడని యువకుడి తల్లి ఉమాదేవి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎస్‌ఐ పరమేశ్‌ నాయక్‌ కేసు నమోదు చేశారు. నరేంద్ర స్థానికంగానే బస్టాండ్‌ పరిసరాల్లోని ఓ గౌడౌన్‌ పక్కన తొట్టిలో పడి మృతి చెందినట్లు ఆదివారం స్థానికులు గుర్తించారు. అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు సమాచారమిచ్చారు.

మదనపల్లె టౌన్‌ : రైతుపై ప్రత్యర్థి కత్తితో దాడి చేసిన సంఘటన ఆదివారం గుర్రంకొండ మండలంలో జరిగింది. ఈ ఘటనపై బాధితుడు కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. గుర్రంకొండ మండలం మర్రిమాకులపల్లి పంచాయతీ సింగంవారి పల్లెకు చెందిన రైతు వెంకటరమణ నాయక్‌ (60) గ్రామానికి సమీపంలోని తన వ్యవసాయ పొలం వద్దకు నడిచి వెళుతుండగా, అదే గ్రామానికి చెందిన తన ప్రత్యర్థి ఆనంద్‌ కత్తితో ఒక్కసారిగా మెడపై దాడి చేశాడు. తీవ్రంగా బాధితుడి కేకలు విని స్థానికులు అక్కడికి రావడంతో నిందితుడు పరారయ్యాడు. రక్తపుమడుగులో పడి ఉన్న బాధితుడిని వెంటనే 108లో మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి, చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి వెళ్లాలని రెఫర్‌ చేశారు. ఘటనపై గుర్రంకొండ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement