పులిచెర్ల(కల్లూరు): అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో ఎక్కడ లేని విధంగా పులిచెర్ల మండలంలో ఏనుగుల సమస్య పరాకాష్టకు చేరింది. గత రెండేళ్లుగా ఇక్కడ ఏదో ఒక గ్రామంలో ఏనుగుల గుంపు తిష్ఠ వేస్తూనే ఉంది. ఎందరో అధికారులు వచ్చి వీటిని వేరే ప్రాంతానికి తరలించాలని చూస్తున్నా.. గజరాజులు మాత్రం పులిచెర్ల సరిహద్దులు దాటడం లేదు. పగలంతా అడవుల్లో ప్రశాంతంగా సేదతీరుతున్న ఏనుగులు, చీకటి పడగానే పొలాలపై పడి బీభత్సం సృష్టిస్తున్నాయి.
మామిడి తోటలే వాటికి ‘మధురాహారం’
పులిచెర్ల మండలంలో విస్తారంగా మామిడి తోటలు ఉండటమే ఈ సమస్యకు ప్రధాన కారణంగా మారింది. ఏనుగులకు ఇక్కడ ఆహారం సుల భంగా, పుష్కలంగా దొరుకుతోంది. ముఖ్యంగా సీజన్ వచ్చిందంటే చాలు.. మామిడి తోపుల్లో చేరి, కాయలను తినడమే కాకుండా ఎంతో కా లంగా పెంచిన పెద్ద పెద్ద కొమ్మలను సైతం విరిచేస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకున్న చెట్లు కళ్ల ముందే విరిగిపోతుంటే రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
భయం గుప్పిట్లో రైతాంగం..
ఏనుగుల భయంతో రాత్రి వేళల్లో పొలాల వైపు వెళ్లడానికే రైతులు వణికిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాల్సి వస్తోంది. కొందరైతే పంట సాగు చేయడానికే భయపడుతుండటంతో.. మండలంలో సగానికి పైగా భూములు సాగుకు నోచుకోక బీడు భూములుగా మారుతున్నాయి. ఏడాది పొడవునా కష్టపడి సాగు చేసిన పంట చేతికి వచ్చే సమయంలో ఏనుగుల బారిన పడటంతో రైతాంగం అప్పులపాలవుతోంది. గుంపులు గుంపులుగా వస్తుండటంతో నష్టం ఊహించని స్థాయిలో జరుగుతోంది.ప్రస్తుతం రైతులు రాత్రి పూట టపాకాయలు కాలుస్తూ, పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ తాత్కాలికంగా వాటిని దూర ప్రాంతాలకు తరిమేస్తున్నారు.
మూగజీవాల బలి.. మనుషుల మృతి
ఈ మానవ–వన్యప్రాణి సంఘర్షణ కేవలం పంట నష్టానికే పరిమితం కాలేదు, ఇరువైపులా పచ్చని సంసారాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మండలంలో జరిగిన ఘర్షణల్లో మూడు ఏనుగులు మృతి చెందగా.. ముగ్గురు అమాయక రైతులు కూడా ప్రాణాలు కోల్పోయారు. రాత్రి వేళల్లో పొలాలకు కాపలా వెళ్లిన రైతులు గజరాజుల దాడికి బలవుతుంటే, అటు ఆగ్రహించిన మనుషులు వేసిన విద్యుత్ కంచెలకు అమాయక మూగజీవాలు ప్రాణాలు విడుస్తున్నాయి.


