ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరులోని జమ్మలమడుగు బైపాస్ రోడ్డులో సోమవారం నిర్వహించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల భారీ బహిరంగ సభకు పకడ్బందీ ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ మెగా సభకు ఉమ్మడి జిల్లాలోని దాదాపు 10 నియోజకవర్గాల నుండి సుమారు లక్ష మంది హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు రాష్ట్ర మంత్రులు బి.సి.జనార్ధన్‌రెడ్డి, పొంగూరు నారాయణ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌లు అధికారులతో కలిసి సభా ప్రాంగణాన్ని క్షేత్రస్థాయిలో ముమ్మరంగా పరిశీలించారు. ఎన్నికల హామీల అమలులో భాగంగా రూ. 30 వేల కోట్ల భారీ వ్యయంతో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించేందుకు జలజీవన్ మిషన్ పనుల పైలాన్, శిలాఫలక నిర్మాణ పనులను కలెక్టర్, ఎస్పీలు పర్యవేక్షించారు. సభకు వేలాదిగా ప్రజలు తరలివస్తున్నందున ప్రాంగణంలో గ్యాలరీలు,వీఐపీ భద్రత, నేతల లైనప్, బారికేడ్ల ఏర్పాటు, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపు, పారిశుధ్యం మరియు తాగునీటి సరఫరా అంశాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా చర్యలు చేపట్టాలని మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే 50 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను ఆది వారం సాయంత్రం లోపు పూర్తి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వెల్లడించారు.


