మదనపల్లె టౌన్ : మదనపల్లె మండలంలో రోడ్డు పనులు చేయడానికి వచ్చిన కర్నూలు భవన నిర్మాణ కార్మికుడు క్రషర్‌లో పడి మృతి చెందాడు. శనివారం వెలుగు చూసిన విషాదకర ఘటనకు సంబంధించి తాలూకా ఎస్‌ఐ చంద్రమోహన్ తెలిపిన వివరాలు.. కర్నూలు జిల్లా పల్లెదొడ్డికి చెందిన మోకాసి మాల దేవప్ప(47) మదనపల్లె మండలం కొత్తపల్లి పంచాయతీ ఈశ్వరమ్మ కాలనీలో డ్రైనేజీ పనులు చేయడానికి ఓ కాంట్రాక్టర్ దగ్గరికి ఇటీవల వచ్చాడు. శుక్రవారం కాలనీలో డ్రైనేజీ పనులు చేస్తుండగా, సిమెంట్ క్రషర్‌లో ప్రమాదవశాత్తు దేవప్ప పడి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితున్ని స్థానికులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్సల అనంతరం తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఘటనపై దేవప్ప కుటుంబీకులకు సమాచారం అందించి, వారి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
మహిళపై దాడి
మదనపల్లె టౌన్ : డ్రైనేజీ నీళ్లు ఇంటి ముందుకు వస్తున్నాయని నిలదీసిన మహిళపై పొరుగింటికి చెందిన ప్రత్యర్థులు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. శనివారం మదనపల్లె మండలంలో చోటు చేసుకున్న ఘటనపై బాధితురాలు తాలూకా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. మండలంలోని సిటిఎం రోడ్డు ఎరగానిమిట్టలో కాపురం ఉంటున్న కళావతి ఇంటి ముందుకు డ్రైనేజీ నీళ్లు పక్కింటి వారు వదిలారు. దీంతో కళావతి డ్రైనేజీ నీళ్లు ఇంటి ముందుకు వస్తున్నాయని వారిని నిలదీయడంతో ఆగ్రహించి మూకుమ్మడిగా ఆమైపె దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితురాలిని కుటుంబీకులు జిల్లా ఆస్పత్రికి తరలించి, చికిత్సల అనంతరం తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ కళా వెంకటరమణ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పాత కక్షలతో వ్యక్తిపై దాడి
మదనపల్లె టౌన్ : పాత కక్షల కారణంగా ఓ వ్యక్తిపై ప్రత్యర్థులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన శనివారం మదనపల్లెలో జరిగింది. బాధితుడు రెండవ పట్టణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. స్థానిక చంద్ర కాలనీలో కాపురం ఉంటున్న శ్రీరాములుకు ఇంటి స్థలం విషయమై పొరిగింటి రమణతో పాత కక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో తన ఇంటి స్థలాన్ని కబ్జా చేయడానికి రమణ యత్నించడంతో అడ్డుకున్న శ్రీరాములుపై రమణ వర్గీయులు కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితున్ని కుటుంబీకులు జిల్లా ఆస్పత్రికి తరలించగా, డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. దాడి ఘటనపై కేసు దర్యాప్తులో ఉందని రెండో పట్టణ పోలీసులు తెలిపారు.
హత్య కేసులో ఒకరి అరెస్ట్
రాజంపేట : నందలూరు మండలం టంగుటూరు పంచాయతీ గట్టుమీదపల్లెలో బెల్లంకొండయ్యను రాయితో హత్య చేసిన కేసులో చిన్నయ్య అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు రాజంపేట ఏఎస్పీ మనోజ్ హెగ్డే తెలిపారు. శనివారం తన కార్యాలయంలో అరెస్టు చూపిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ హత్య కేసులో నిందితుడిని రాజంపేట జేఎఫ్‌సీఎం కోర్టుకు హాజరుపరిచామన్నారు. రిమాండ్‌కు తరలించామన్నారు. ఏఎస్పీతో పాటు సీఐ వెంకటేశ్వర్లు, నందలూరు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి, నందలూరు పోలీసులు పాల్గొన్నారు.


