కలెక్టర్ నిశాంత్ కుమార్
మదనపల్లె : జిల్లాలో గ్రామీణ, జాతీయ, రాష్ట్ర రహదారులు కలిసే చోట ప్రమాదాల నివారణకు యుద్ధ ప్రాతిపదికన స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఆయన రహదారుల భద్రతపై జిల్లా స్థాయి కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారుల వద్ద స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులు, లైటింగ్, భద్రతా చర్యలను చేపట్టాలని పేర్కొన్నారు. గత సమావేశంలో నిర్ణయించిన మేరకు పోలీస్, ఇంజినీరింగ్ శాఖలు సమన్వయంతో పని చేసి 232 చోట్ల గుర్తించిన ప్రమాదకర ప్రాంతాల్లో 50 స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న 19 బ్లాక్ స్పాట్స్ గుర్తించగా, 14 చోట్ల భద్రత చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి బ్లాక్ స్పాట్, మలుపుల వద్ద ప్రమాదాలను తగ్గించే దిశగా స్పీడ్ డిటెక్టెడ్ కెమెరాలు, వేగనిరోధకం, లైటింగ్, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదన సమర్పించాలని డీఎంహెచ్‌ఓకు ఆదేశించారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి రహదారుల భద్రతపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. జనవరి నుంచి జిల్లాలో జరిగిన ప్రమాదాలపై వివరించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు
జిల్లాలో మాదకద్రవ్యాలను పూర్తిస్థాయిలో అరికట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం ఎస్పీ ధీరజ్‌తో కలిసి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలకు సంబంధించి టోల్ ఫ్రీ నంబర్:1972 కు ఫోన్ చేసి తెలిపేలా ప్రచారం కల్పించాలన్నారు. శ్రీడ్రగ్స్ వద్దు బ్రోశ్రీ పోస్టర్లలో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ వాట్సాప్ నంబర్, టోల్ ఫ్రీ నంబర్లతో జిల్లా వ్యాప్తంగా అందరికీ తెలిసేలా ఏర్పాటు చేయాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఎవరైనా గంజాయి సేవించే వారి వివరాలు తెలిసినప్పుడు టోల్ ఫ్రీ, వాట్సప్ నంబర్లకు సమాచారం పంపించేలా మహిళా సంఘాలకు అవగాహన కల్పించాలని కోరారు.


