యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Mar 11 2026 7:44 AM | Updated on Mar 11 2026 7:44 AM

మదనపల్లె టౌన్‌ : ఉరేసుకుని ఒరిస్సా యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం తంబళ్లపల్లెలో వెలుగు చూసింది. ఎస్‌ఐ అనీల్‌ కుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. ఒరిస్సా రాష్ట్రం గజపతి జిల్లా నాలాగట్‌కు చెందిన మనోజ్‌ బిసాయ్‌ (30) ఉపాధి కోసం ఇటీవల తంబళ్లపల్లెకు వచ్చాడు. స్థానిక పరసతోపు కాలనీలోని ఓ ఇంటిలో అద్దెకు ఉంటూ తంబళ్లపల్లెలోని వేరుశనగ కాయల మిల్లులో పని చేస్తున్నాడు. ఇంతలో మనోజ్‌ బిసాయ్‌కి ఏం కష్టం వచ్చిందో.. ఏమో..? తాను అద్దెకు ఉంటున్న ఇంటి తలుపునకు గడియ పెట్టుకుని చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో వెంటనే ఎస్‌ఐ వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రి మార్చురీకి మృతదేహాన్ని తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

బస్సు ఢీకొని

తండ్రీకుమారుడికి గాయాలు

మదనపల్లెటౌన్‌ : బస్సు ఢీకొని తండ్రి, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మంగళవారం వాల్మీకిపురం మండలంలో వెలుగులోకి వచ్చింది. ఘటనపై ఎస్‌ఐ తిప్పేస్వామి తెలిపిన వివరాలు.. వాల్మీకిపురం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ఉంటున్న క్లాస్‌ వన్‌ కాంట్రాక్టర్‌ శ్రీరాములు(60). అతని చిన్న కుమారుడు దేవాన్స్‌(6). శ్రీరాములు తన కుమారుడిని తీసుకుని రోడ్డుకు సమీపంలో ఉన్న దుకాణం వద్దకు ద్విచక్ర వాహనంలో వెళ్లారు. కుమారుడికి తిను బండారాలు తీసుకుని తిరిగి బైకులో ఇంటికి వస్తుండగా, మర్రిపాడు రోడ్డులోని మలుపు వద్ద వేగంగా వచ్చిన ఓ ప్రయివేట్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తండ్రీకుమారుడిని స్థానికుల సాయంతో కుటుంబీకులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్సల అనంతరం అక్కడి నుంచి మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యలు పరీక్షించి చికిత్స అనంతరం తిరుపతికి వెళ్లాలని రెఫర్‌ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

చింత చెట్టుపై నుంచి పడి..

మదనపల్లె టౌన్‌ : చింతచెట్టు పైనుంచి పడి ఓ కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన మంగళవారం మదనపల్లె మండలంలో జరిగింది. ప్రమాదానికి సంబంధించి బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని బసినికొండ గ్రామం గంగన్నగారిపల్లెకు చెందిన రామన్న కుమారుడు ఎం.రవి(38) మదనపల్లెకు చెందిన ఓ వ్యాపారి చింత చెట్లలో చింత కాయలు కోయడానికి సహచర కూలీలతో కలసి కూలి పనులకు వెళ్లాడు. నిమ్మనపల్లె రోడ్డులోని పాలిటెక్నిక్‌ కళాశాల సమీపంలో ఉన్న చింత తోపులో చింత చెట్టెక్కి చింత కాయలు కోస్తుండగా, ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని గమనించిన తోటి కూలీలు చికిత్సల కోసం వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. డాక్టర్లు పరీక్షించి వైద్య చికిత్సలు అందించిన పిదప అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తిరుపతికి రెఫర్‌ చేశారు. ప్రమాదానికి సంబంధించి తాలుకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement