ఒంటిమిట్ట: ఏకశిలానగరిలో కొలువైన కోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజు శుక్రవారం ఉదయం కాళీయమర్దన అలంకారంలో జగదభిరాముడిని ముస్తాబు చేశారు. పట్టు వస్త్రాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో అందంగా అలంకరించారు. ఉదయం 7:30 నుంచి 9:30 గంటల వరకు స్వామివారి ఊరేగింపు జరిగింది. భజన బృందాలు భజనలు, కోలాటాలు అడుతుండగా స్వామి వారు పురవీధుల్లో విహరించారు. అనంతరం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులకు అభిషేకం చేశారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ నిర్వహించారు.
ఆశ్వవాహనంపై సీతాపతి
శుక్రవారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉపనిషత్తుల ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్ముడు అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది.
బ్రహ్మోత్సవాల్లో నేడు: కోదండ రాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు శనివారం ఉదయం 10:30 నుంచి 11:15 గంటల వరకు చక్రస్నానం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. సాయంత్రం 7 నుంచి రాత్రి 8 గంటల వరకు కు ధ్వజావరోహణం ఉంటుందని ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి తెలిపారు.


