కేవీపల్లె : భూ వివాదంతో మహిళపై దాడి చేసిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా వున్నాయి. మండలంలోని కేవీపల్లె పంచాయతీ రాములవాండ్లపల్లెకు చెందిన కంభం మహేష్‌రెడ్డి భార్య కె.సుష్మిత (30) మంగళవారం తమ పొలం వద్దకు వెళ్లింది. భూ వివాదంతో అదే గ్రామానికి చెందిన కె. అరుణమ్మ, యర్రంరెడ్డి, భూదేవి, నాగిరెడ్డి, లోకేశ్వరి, కమ్మిరెడ్డి, తులసీరెడ్డి దౌర్జన్యంగా తనపై దాడి చేసి కొట్టారని బాధితురాలు పేర్కొంది. ప్రస్తుతం తాను గర్భవతినని, వారు కొట్టిన దెబ్బలకు గర్భస్రావమయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. అంతేగాక తమ పొలం వద్ద బోరు, ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం చేశారని, గతంలో కూడా నాలుగైదు సార్లు ఘర్షణకు దిగారని తెలిపింది. బాధితురాలు చికిత్స నిమిత్తం గర్నిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రలో చేరింది. దాడి చేసిన వారు టీడీపీ వర్గీయులు కావడంతో అధికార బలాన్ని ఉపయోగిస్తున్నారని, అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరారు.
ప్రధానమంత్రిపై
వివాదాస్పద పోస్టులు
రాయచోటి టౌన్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన రిహాన్ అనే వ్యక్తిపై అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అర్బన్ సీఐ బీవీ చలపతి మీడియాతో మంగళవారం మాట్లాడుతూ.. నిందితుడిపై 132/2026, అండర్ సెక్షన్ 196, 353(1) (బి), 353(2), 352 బీఎన్‌ఎస్–2023, సెక్షన్ 67 ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. సమాజంలో శాంతికి హాని కలిగించే విధంగా పోస్టులు పెడితే ఇలాంటి శిక్షలకు అర్హులన్నారు. అలాగే ఫేక్ అకౌంట్స్ ప్రారంభించి సమాజంలో కలహాలు రేపే విధంగా పెట్టకూడదని, కులమతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా పోస్టులు పెట్టడం, వ్యక్తిగత ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం, మహిళలు, చిన్నారులపై అసభ్యకరమైన పోస్టులు, మార్ఫింగ్ చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.


