చంద్రబాబు ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలి
రాజంపేట : రాజంపేటను జిల్లా చేసుకుందాం..మెడికల్ కాలేజి పెట్టిస్తా.. రాజంపేటను గొప్పనగరంగా తీర్చిదిద్దుతా అంటూ రాజంపేట ఎన్నికల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం అన్నమయ్య జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో, నందలూరు వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ గోపిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన 9వ రోజు నిరాహార దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నియోజకవర్గాలకే అన్నమయ్య జిల్లా పరిమితమైందని, ఇప్పుడు ఈ మూడు నియోజకవర్గాల కేంద్ర బిందువు రాజంపేట అని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలన్నారు. జిల్లా కేంద్రం చేసుకోవడానికి రాజంపేటకు అన్ని అర్హతలు ఉన్నాయనే విషయం ప్రభు త్వం గుర్తించాలన్నారు. రాజకీయాలొద్దు అని, అందరికి ఒకటే అజెండా అదే రాజంపేట జిల్లా కేంద్రం కావాలని పిలుపునిచ్చారు. అన్నమయ్య జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మర్రి రవికుమార్ మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా ఉద్యమిస్తే తప్పకుండా రాజంపేట జిల్లా కేంద్రంగా మారుతుందన్నారు. కార్యక్రమంలో నందలూరు వైఎస్సార్‌సీపీ నేతలు గీతాల నరసింహారెడ్డి, షేక్ మహబూబ్‌బాషా, పల్లెం వెంకటేశు, దాదిరెడ్డి నరసారెడ్డి, నందలూరు శివ, చింతకాయల శంకరయ్య, గడికోట వెంకటసుబ్బారెడ్డి, సౌమిత్రి, రాజంపేట వైఎస్సార్‌సీపీ నేతలు వడ్డె రమణ, దండుగోపి, ఏజెఏసీ నేతలు సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి


