యమ డేంజర్!
ప్రతి చోట బ్లాక్ స్పాట్స్
సరైన అలైన్‌మెంట్ లేదు : మేడా
రాజంపేట: కడప–రేణిగుంట హైవే.. డేంజర్ జోన్‌గా మారిందనే అంశం పార్లమెంట్‌లో కూడా చర్చకు వచ్చింది. రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి కడప–రేణిగుంట జాతీయ రహదారి దుస్థితిపై గళం విప్పారు. సరైన అలైన్‌మెంట్ లేదని, నైట్ జర్నీ యమడేంజర్‌గా ఉందని తెలియజేశారు. వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించే పరిస్థితులు ఉన్నాయని చెప్పుకురావడంతో ఈ అంశం కేంద్ర రవాణాశాఖను తాకింది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదం సంభవిస్తోంది. హైవే దారంతా రక్తపు మరకలే కనిపిస్తున్నాయి. నిత్యం ప్రమాదాలు కొనసాగుతున్నాయి. ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. రెండు దశాబ్దాల కిందట సింగిల్ రోడ్డుగా ఉన్న రహదారిని వెడల్పు చేసి స్టేట్ హైవే డబుల్ రోడ్డుగా మార్చారు. ఉభయ వైఎస్సార్ జిల్లాలో ఈ రోడ్డు కొనసాగుతోంది.
ప్రయాణం.. భయానకం
ప్రస్తుత హైవే వెంట ప్రయాణం భయానకంగా మారింది. ఎటువైపు నుంచి ప్రమాదం పొంచి ఉందో తెలియని పరిస్థితి. కడప శివార్లలోని జేఎంజే కళాశాల నుంచి భాకరాపేట సర్కిల్, మాధవరం, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, పుల్లంపేట, ఓబులవారిపల్లె, మంగంపేట, రైల్వేకోడూరు, శెట్టిగుంట, కుక్కులదొడ్డి వరకు హైవేలో రహదారి ప్రయాణం కత్తి మీద సాములా మారింది. మార్గంలో అనేక ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఒంటిమిట్ట, నందలూరు, రెడ్డిపల్లె చెరువుకట్టలపై రహదారి ఉంది. అనేక మార్లు వాహనాలు అదుపు తప్పి చెరువుల్లో పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. దక్షిణ భారతదేశం నుంచి తిరుమలకు కడప–రేణిగుంట మార్గం మీదుగా వేలాది మంది యాత్రికులు వాహనాల్లో ప్రయాణం చేస్తుంటారు. తెలంగాణా, మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు రాజస్తాన్, యూపీ తదితర రాష్ట్రాల నుంచి కూడా యాత్రికులు ఈ రోడు మార్గాన్నే వెళుతుంటారు. తుపాన్‌తోపాటు రకరకాల ఫోర్‌వీల్ వాహనాల్లో యాత్ర కొనసాగించడం అధికంగా ఉంటుంది. పలుమార్లు వాహనాలు ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయి.
పెరుగుతున్న ట్రాఫిక్
కడప–రేణిగుంట హైవేలో రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతోంది. ఈ మార్గం మీదుగా తిరుపతి, చైన్నె, ముంబయి, హైదరాబాద్‌కు రాకపోకలు కొనసాగుతున్నాయి. నిత్యం 17 వేలకు పైగా వాహనాలు హైవేపై పరుగులు తీస్తున్నాయి. ఈ ట్రాఫిక్‌కు ప్రస్తుతం ఉన్న హైవే కెపాసిటీ సరిపోవడం లేదు. ఫలితంగా ప్రమాదాలు, ట్రాఫిక్ స్తంభించడం తరుచూ జరుగుతున్నాయి. అంతే గాకుండా కడప–రేణిగుంట రోడ్డు ప్రయాణం రెండు నుంచి మూడు గంటలకు పైగా పడుతోంది. సకాలంలో గమ్యాలకు చేరలేని పరిస్థితి ఉంది.
కడప–రేణిగుంట హైవేలో ప్రతి మండల పరిధిలో బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించారు. రాజంపేట అర్బన్‌లో 3, నందలూరు 2, , రైల్వేకోడూరు 3, పుల్లంపేట 3 ఓబలవారిపల్లె 6, మన్నూరు 3 ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలు సర్వే చేసి కడప–రేణిగుంట ప్రస్తుత హైవేలో ప్రమాదాలు జరుగుతున్నాయని నిర్ధారణకు వచ్చింది. ఈ క్రమంలో పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట పెద్దాసుపత్రిలో ట్రామా సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు అందుబాటులో లేదనే సంగతి విదితమే.
అధ్వానస్థితిలో కడప–రేణిగుంట హైవే
ప్రమాదకర మలుపులు
ప్రాణాలు పోతున్న వైనం
పార్లమెంట్‌లో గళం విప్పినమేడా రఘునాథరెడ్డి
కడప–రేణిగుంట హైవేకు సరైన అలైన్‌మెంటట్ లేదని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి పార్లమెంట్ సాక్షిగా గళం విప్పారు. ప్రమాదాలకు నిలయంగా మారిందన్నారు. మలుపులు ఉన్నాయని, రాత్రి పూట ప్రయాణం భయంకరంగా ఉంటుందన్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారిందన్నారు. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రమాదరహిత రహదారిగా మార్చాలని కోరారు.
కడప –రేణిగుంట నేషనల్ హైవేలోని నందలూరు చెయ్యేరు నదిపై నిర్మించి వంతెన(బ్రిడ్జి) ప్రమాదాలకు నిలయంగా నిలిచిపోయింది. వంతెనపై ప్రమాద నివారణ చర్యలేవి కనిపించడం లేదు. వంతెన మధ్యలో ఉన్న బీటి (తారు)రోడ్డు అస్తవ్యస్తంగా తయారైంది. రోడ్డు మధ్యలో గుంతలు పడ్డాయి. బ్రిడ్జిపై వేగాన్ని నిరోధించే విధంగా బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు కూడా వేయలేదు. రాత్రి వేళలో వంతెనపై చీకటిగా ఉండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవడమే కాకుండా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ బ్రిడ్జి సగం మన్నూరు, మరో సగం నందలూరు పోలీసు స్టేషన్ల పరిధిలోకి వస్తాయి. కిలోమీటర్లకు పైగా పొడవు కలిగిన ఈ వంతెన మృత్యుకుహరంగా మారింది.
యమ డేంజర్!
యమ డేంజర్!
యమ డేంజర్!
యమ డేంజర్!


