21న పల్స్‌పోలియోను విజయవంతం చేయండి
రాయచోటి: జిల్లాలో ఈ నెల 21వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ తెలిపారు. రాయచోటి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్‌లో మంగళవారం ‘ప్రతిసారి రెండు చుక్కలు.. పోలియోపై నిరంతరం విజయం’ అనే పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణలో జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా చేపట్టిన ముఖ్యమైన ప్రజా ఆరోగ్య కార్యక్రమమని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐదేళ్లలోపు వయసు గల పిల్లలకు నోటి పోలియో వ్యాక్సిన్‌ను ఉచితంగా అందజేస్తారని వివరించారు. పల్స్ పోలియో రోజులలో ప్రత్యేకంగా నిర్వహించే రోగనిరోధకత డ్రైవ్‌లు ద్వారా వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సేవకులు, సమాజ సంస్థలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈనెల 21వ తేదీన (ఆదివారం) అర్హులైన పిల్లలను సమీపంలోని పల్స్ పోలియో బూత్‌కు తీసుకువచ్చి వ్యాక్సిన్ వేయించి దేశాన్ని పోలియో రహితంగా ఉంచడంలో తల్లిదండ్రులు, సంరక్షకులు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ శ్రీలక్ష్మీ, నరసయ్య, ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ జి.ఉషశ్రీ, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
49.160 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
అన్నమయ్య జిల్లాలో ఈ నెల 16 నాటికి 45 ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా 49.160 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేశామని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు ధాన్యం విక్రయించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబరు: 08561–293953ను సంప్రదించాలని సూచించారు. జిల్లాలో 45 ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రైతులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


