డిమాండ్ల సాధన కోసం నిరసన
రాయచోటి అర్బన్ : సహకార శాఖ ఉద్యోగులు డిమాండ్ల సాధన కోసం మంగళవారం రాయచోటిలోని జిల్లా సహకార అధికారి కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సహకార శాఖ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ సమస్యలు పరిష్కరించాలని నినదించారు. ఈ సందర్భంగా జిల్లా సహకార సంఘ అధ్యక్షుడు సీవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా జనరల్ సెక్రటరీ రెడ్డి బాబు మాట్లాడుతూ తమ సమస్యల పట్ల ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీఓ నంబర్ 36ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులను రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16వ తేదీన జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమంతోపాటు 29వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా అధికారి గురు ప్రకాశ్‌కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సాబ్జాన్, ఆంజనేయులు, ఆంజనేయ రెడ్డి, మదనపల్లె సబ్ డివిజన్‌కు చెందిన హరినాథరెడ్డి, కరుణాకర్ రెడ్డి, రాజంపేట సబ్ డివిజన్‌కు చెందిన వెంకటరమణ, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


