ఎర్రచందనం దుంగలు స్వాధీనం
కేవీపల్లె : మండలంలో రూ. 7.20 లక్షల విలువైన ఏడు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కలకడ సీఐ లక్ష్మన్న, కేవీపల్లె ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప తెలిపారు. మంగళవారం నిందితులను అరెస్ట్ చూపి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని నూతనకాల్వ పంచాయతీ గుట్టలపై మార్గములో నల్లగుట్ట వద్ద ఎర్రచందనం దుంగలు అక్రమంగా తరలించడానికి సిద్ధం చేసినట్లు అందిన సమాచారంతో పోలీసులు దాడి చేశారు. అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న 144 కేజీల బరువుగల ఏడు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో తిరుపతి జిల్లా యర్రవారిపాళెం మండలం యల్లమంద పంచాయతీ మద్దెలవారిపల్లెకు చెందిన పిల్లెల సురేంద్ర, దొమ్మయ్యగారిపల్లెకు చెందిన పత్తిపాటి త్యాగరాజు నాయుడు, బోయపల్లెకు చెందిన అంకెం రమణ ఉన్నారు. ఈ దాడిలో ఏఎస్‌ఐ వెంకటస్వామి, హెడ్ కానిస్టేబుల్ రెడ్డిమోహన్, కానిస్టేబుల్ పురుషోత్తం పాల్గొన్నారు.
ముగ్గురు నిందితుల అరెస్ట్


