
విద్యుత్ కార్మికులను విస్మరిస్తే సహించం
రాజంపేట రూరల్ : జిల్లాలో పని చేస్తున్న విద్యుత్తు ఉద్వోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను విస్మరిస్తే సహించబోమని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.చంద్రశేఖర్, జిల్లా సహాయకార్యదర్శి చిట్వేలి రవికుమార్ హెచ్చరించారు. స్థానిక విద్యుత్ కార్యాలయం ఎదుట రాజంపేట విద్యుత్ స్ట్రగుల్ కమిటీ ఆద్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను సంస్థలో విలీనం చేసి.. రెగ్యులర్ చేయాలన్నారు. వన్ ఇండస్ట్రీ వన్ సర్వీస్ రెగ్యులేషన్స్ అమలు చేయాలని, గ్రేడ్ 2 కార్మికులకు న్యాయం చేసే వరకూ పాత పెన్షన్ పద్ధతి పునరుద్ధరించాలన్నారు. నగదు రహిత అపరిమిత మెడికల్ పాలసీని, గ్రేడ్–2 జేఎల్‌ఎంలకు ఏపీఎస్‌ఈబీ సర్వీస్ రెగ్యులేషన్స్ వర్తింపజేయాలని కోరారు. కాంట్రాక్టు కార్మికులకు కోటి రూపాయల ఇన్సూరెన్స్ ఇవ్వాలని, దళారీ వ్యవస్థ లేకుండా కార్మికులకు నేరుగా వేతనాలు చెల్లించాలని తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించే వరకూ ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యుఈఈయూ జిల్లా కార్యదర్శి ఈ.శ్రీహరి, కిరణ్‌కుమార్, పి.బాలకృష్ణ, డి.సుధాకర్, సురేంద్ర, ఎరికలరెడ్డి, నాగబాలాజి, తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.చంద్రశేఖర్