
ప్రమాదంలో బొమ్మిరెడ్డి చెరువు
బి.కొత్తకోట: బి.కొత్తకోట మండలం బండారువారిపల్లె పంచాయతీలోని బొమ్మిరెడ్డిచెరువు ప్రమాదస్థితిలో ఉండటంతో మూడు గ్రామాల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఆదివారం రాత్రి ప్రజలు కట్టపైకి చేరుకుని ఏం జరుగుతుందో అని ఆందోళన చెందారు. దీనికి సంబంధించి వివరాలు. మండలంలోని కనికలతోపు సమీపంలో ముంబై–చైన్నె జాతీయ రహదారిపైనే బొమ్మిరెడ్డి చెరువు ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు నిండిపోయి ప్రవహిస్తోంది. రెండురోజులుగా కురిసిన భారీ వర్షానికి హర్సిలీహిల్స్, పక్కనే ఉన్న కొండలు, గుట్టల్లో కురిసిన వర్షంనీళ్లు చెరువులోకి చేరడంతో ప్రమాదకర స్థాయిలో నిండింది. మొరవ వెళ్తున్నప్పటికి నీటి మట్టం తగ్గడం లేదు. ఈ పరిస్థితుల్లో కట్ట బలహీపడింది. కట్టపై పగుళ్లు రావడమే కాకుండా మట్టి కుంగుతోంది. కట్టపైన తారురోడ్డుకు పగుళ్లు వచ్చాయి. దీంతో చెరువుకట్ట ప్రమాదస్థితికి చేరడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దురదృష్టవశాత్తు కట్ట తెగితే..దీనికి సమీపంలోని కనికలతోపు, ఉమాశంకర్‌కాలనీ, తుమ్మనంగుట్ట, మద్దూరివారిపల్లె కాలనీకి ప్రమాదం వాటిల్లుతుంది. ఇళ్లు మునిగిపోయే పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
కట్ట బలహీనపడి పగుళ్లు, కుంగుతున్న కట్ట

ప్రమాదంలో బొమ్మిరెడ్డి చెరువు