
దీపావళి ప్రతి ఇంటా కాంతులు నింపాలి
రాజంపేట టౌన్/రాయచోటి అర్బన్: దీపా వళి ప్రతి ఇంటా కొత్త కాంతులు నింపాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు ఆయన పండుగ శుభాకాంక్షలను తెలిపారు. దీపావళి అంటే చీకటిపై కాంతి, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయంగా పేర్కొన్నారు. ఈ పండుగను ప్రజలందరూ ఆనందంగా, జాగ్రత్తగా జరుపుకోవాలని సూచించారు.
రాయచోటి: ఈనెల 20న నిర్వహించనున్న ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేశారు. రాయచోటి కేంద్రంగా కలెక్టరేట్ , ఎస్పీ కార్యాలయాల్లో సోమవారం జరగబోయే ఈ కార్యక్రమాన్ని దీపావళి పండుగ నేపథ్యంలో తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆదివారం వేర్వేరుగా అందజేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి స్పందన ఫిర్యాదులను సమర్పించేందుకు రావద్దని ప్రకటనలో పేర్కొన్నారు.
పీబీసీలోకి కృష్ణా జలాలు
బి.కొత్తకోట: మండలంలోని గుండ్లపల్లె వద్ద హంద్రీ–నీవా పుంగనూరు ఉప కాలువ (పీబీసీ)కు గత బుధవారం గండిపడి తెగిపోయిన విషయం తెలిసిందే. దీనికారణంగా నీటి తరలింపు నిలిపివేశారు. కాలువకు మరమ్మతులు పూర్తి చేయడంతో సత్యసాయిజిల్లా కదిరి సమీపంలోని చెర్లోపల్లె రిజర్వాయర్ నుంచి ఆదివారం తెల్లవారుజాము 1.30 గంటలకు కృష్ణా జలాలను విడుదల చేశారు. తొలుత 200 క్యూసెక్కులు వదిలిన అధికారులు కొన్నిగంటల తర్వాత 275 క్యూసెక్కులకు పెంచారు. గండిపడిన కాలువ మరమ్మతులు పూర్తిచేసినా మళ్లీ అక్కడ గండిపడకుండా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.