
తండ్రీకొడుకుల కుట్రలను గడపగడపకు తెలియజేయాలి
రాజంపేట టౌన్: మెడికల్ కళాశాలలను తన అనుచరులకు కట్టపెట్టి తద్వారా జేబులు నింపుకునేందుకు చంద్రబాబునాయుడు, నారాలోకేష్ పన్నుతున్న కుట్రలను గడప గడపకు తెలియచేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. మాజీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ప్రైవేట్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శనివారం మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించారు. ఈసందర్భంగా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మున్సిపాలిటిలోని వివిధ వార్డులకు చెందిన కౌన్సిలర్లకు కోటి సంతకాల సేకరణ పత్రాలను ఎమ్మెల్యే అందచేశారు. అనంతరం అమరనాథరెడ్డి విలేకరులతో మాట్లాడారు. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ అయితే ముఖ్యంగా పేదలకు నాణ్యమైన వైద్యం అందని ద్రాక్షలా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆయా కళాశాలల యాజమాన్యాలు ఒక్కో మెడికల్ సీటుకు డొనేషన్ల రూపంలో భారీ మెత్తంలో తీసుకుటాయన్నారు. అందువల్ల పేద విద్యార్థులు డాక్టర్ కావాలన్న కల కలలాగనే మిగిలిపోతుందన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడతారని వైఎస్.జగన్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగా ప్రజల అభిప్రాయాన్ని కూడా సేకరించేందుకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి పిలుపునిచ్చారని తెలిపారు. ఈకార్యక్రమాన్ని జిల్లాలోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలన్నారు. ప్రజల అభివప్రాయాలను జగన్ గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్ళి ప్రైవేటీకరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తారన్నారు. వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు పోలా వెంకటరమణారెడ్డి, కృష్ణారావుయాదవ్, వడ్డే రమణ, డీలర్ సుబ్బరామిరెడ్డి, రక్కాసి శ్రీవాణి, మిర్యాల సురేఖ, ఖాజా మొహిద్దీన్, సనిశెట్టి నవీన్‌కుమార్, సూరి, నాసిర్, నామ్‌నగర్ శివ పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఆకేపాటి అమరనాథరెడ్డి