
సామాన్యుడిపై టీడీపీ నాయకుల దౌర్జన్యం
సుండుపల్లె : అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు, రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చమర్తి జగన్మోహన్‌రాజు బంధువుల స్థల వివాదం.. నరసింహరాజుపై దౌర్జన్యం చేసేలా జరిగింది. ఒక పక్క అధికార బలం.. మరో పక్క పదవిలో ఉన్న టీడీపీ నేత కావడంతో.. ఆయన అనుచరులు అడ్డంగా దూసుకొచ్చారు. సామాన్యుడిగా ఉన్న నరసింహరాజు కుటుంబీకులపై వాదోపవాదాలు చేస్తూ దౌర్జన్యంగా తోసేశారు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక సొంత భూమిని కాపాడుకోవాలన్న తపనతో ప్రయత్నం చేసిన అతని పైకి వస్తుండటంతో.. తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. వివరాలలోకి వెళ్లితే.. సుండుపల్లె మండల పరిధిలోని పెద్దినేనికాలువ గ్రామ పంచాయతీ రాచపల్లికి చెందిన నరసింహరాజు ఒక పత్రిక పెట్టుకుని హైదరాబాదులో జీవనం సాగిస్తున్నారు. బాధితుని కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నరసింహరాజు 6 నెలల క్రితం తన స్వగ్రామంలో కొండూరు విజయభాస్కర్‌రాజు దగ్గర ఒక ఎకరా భూమిని కొనుగోలు చేశాడు. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆయన ఎకరా భూమిపై కన్నుపడింది. ఆ స్థలం తమకు కావాలని అడిగారని, తాను ఇవ్వనని చెప్పానని బాధితుడు మీడియాకు తెలిపారు. రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చమర్తి జగన్‌మోహన్‌రాజు అత్తవారి స్థలం ఇదని, నువ్వు ఎలా కొంటావని నరసింహరాజును జగన్‌మోహన్‌రాజు అనుచరులైన మండల టీడీపీ నాయకులు శివరాంనాయుడు మరో 15 మందిని వెంటబెట్టుకొని వెళ్లి వారిపై దాడికి పాల్పడ్డాడు. నరసింహరాజు తన పొలంలో నాటుకున్న జామ చెట్లను దౌర్జన్యంగా పీకేశారు. స్వతహాగా పత్రికా వ్యక్తి అయిన నరసింహరాజు వీడియోలు, ఫొటోలు తీసేందుకు ప్రయత్నిస్తే అతని ఫోన్‌ని లాక్కున్నారు. సర్వే నంబర్ 47 సబ్ డివిజన్ చేసి 457/1, 2,3 మూడు భాగాలుగా విభజన జరిగింది. 457/1లో ఏ, బీ, సీలుగా సబ్ డివిజన్ అయింది. అందులో పాస్‌బుక్‌లో పేర్కొన్న ప్రకారం వన్‌బీలో ఉన్న ఎకరా స్థలం తనదేనని నరసింహరాజు అంటున్నాడు.
జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు
టీడీపీ రాజంపేట ఇన్‌చార్జి చమర్తి జగన్‌మోహన్‌రాజు అత్తగారి భూమి భాగాలలో.. అదే గ్రామానికి చెందిన నరసింహరాజు ఒక ఎకరా భూమి తగాదా విషయమై బాధితుడు అయిన నరసింహరాజు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి ఫిర్యాదు చేశారు. 6 నెలల క్రితం కొన్న భూమిలో తాను జామచెట్లను నాటుతుండగా మండల టీడీపీ నాయకుడు శివరాంనాయుడు మరికొంత మందిని వెంటబెట్టుకొని తనపై, తన కుటుంబ సభ్యులపై దౌర్జన్యానికి దిగి తమకు తోసేశారని పేర్కొన్నాడు. వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని నరసింహరాజు తన వారితో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఎస్పీ కార్యాలయం దగ్గర పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి తనకు న్యాయం చేయాలని కోరాడు. ‘మాకు బలం లేదు.. టీడీపీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ నేతలు మాపై దౌర్జన్యం చేస్తున్నారు. ఎస్పీనే మాకు న్యాయం చేయాలి’ అని వేడుకున్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు చమర్తి
బంధువుల స్థల వివాదం
అధికార బలంతో అడ్డంగా
దూసుకొచ్చిన టీడీపీ శ్రేణులు
జిల్లా ఎస్పీకి బాధితుడి ఫిర్యాదు

సామాన్యుడిపై టీడీపీ నాయకుల దౌర్జన్యం