
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు గాయపడి స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ములకలచెరువు మండలం చౌడసముద్రంకు చెందిన రమణ(60) తనకు పరిచయస్తుడైన మదనపల్లె మండలం పోతబోలుకు చెందిన నరసింహులుతో కలిసి చౌడసముద్రం నుంచి పాపిరెడ్డిపల్లెకు బయలుదేరారు. మార్గమధ్యంలోని చెట్లవారిపల్లె వద్ద ట్రాక్టర్ పక్క నుంచి ఉన్నట్లుండి రోడ్డుపైకి రావడంతో ద్విచక్రవాహనం ఢీకొంది. ప్రమాదంలో రమణ తీవ్రంగా గాయపడగా, స్థానికులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
● నిమ్మనపల్లె మండలం ఎగువమాచిరెడ్డిగారిపల్లెకు చెందిన ఫిరోజ్, అతడి భార్య రాజమ్మ(45) ఇద్దరూ కలిసి ద్విచక్రవాహనంలో సోమలకు వెళుతుండగా, మార్గమధ్యంలోని కందూరు సమీపంలో మరో ద్విచక్రవాహనం ఢీకొనడంతో రాజమ్మ తీవ్రంగా గాయపడింది. స్థానికులు బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
● కడప జిల్లా ఖాజీపేటకు చెందిన శంకరనాయక్ (24), కామాక్షయ్య(35) అరటికాయలు అన్‌లోడ్ చేసేందుకు కూలీ పనుల్లో భాగంగా పులివెందుల నుంచి బొలేరో వాహనంలో పలమనేరుకు బయలుదేరారు. మార్గమధ్యంలోని కురబలకోట మండలం ముదివేడు సమీపంలో బొలేరో ముందు చక్రం పంక్చర్ కావడంతో వాహనం అదుపుతప్పింది. దీంతో పైన ఉన్న ఇద్దరు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆయా ఘటనలపై సంబంధిత పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
జింక అడ్డు రావడంతో..
మదనపల్లె రూరల్ : రోడ్డు ప్రమాదంలో వెటర్నరీ ఉద్యోగి తీవ్రంగా గాయపడిన ఘటన సోమవారం ములకలచెరువు మండలంలో జరిగింది. కందుకూరు వెటర్నరీ కేంద్రంలో ఎల్‌ఎస్‌ఏగా పని చేస్తున్న నాగేంద్రప్రసాద్(47) సోమవారం సమావేశం నిమిత్తం కందుకూరు నుంచి బురకాయలకోటకు వెళుతుండగా, మార్గమధ్యంలోని దూలంవారిపల్లె సమీపంలో రోడ్డుకు అడ్డంగా జింక రావడంతో బైక్ అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో కాలు విరిగింది. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు.
డిప్యూటీ ఎండీవోకు..
పెద్దతిప్పసముద్రం : మండలంలోని బూర్లపల్లి సచివాలయంలో పని చేసే డిప్యూటీ ఎండీవో క్రిష్ణప్రసాద్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 27న ఆయన విధులు ముగించుకుని తన ద్విచక్ర వాహనంలో సత్యసాయి జిల్లా పెనుగొండకు వెళుతుండగా సోమందేపల్లి వద్ద కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో కర్నూల్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నట్లు మండల పరిషత్ సిబ్బంది సోమవారం తెలిపారు. విషయం తెలుసుకున్న బూర్లపల్లి సర్పంచ్ సుబ్బిరెడ్డి కర్నూల్‌లోని అదే ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌గా పని చేస్తున్న తన బావమరిదికి ఫోన్ చేసి అధికారి క్రిష్ణప్రసాద్ ఆరోగ్యం కుదుట పడేందుకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు.
గాయపడిన వెటర్నరీ ఉద్యోగి నాగేంద్రప్రసాద్
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రిష్ణప్రసాద్

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు