
భ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామికి విశేష పూజలు
తంబళ్లపల్లె : మండల కేంద్రానికి సమీపంలోని మల్లయ్యకొండపై వెలసిన శ్రీభ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామి ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. దేవీశరన్నవరాత్రుల సందర్భంగా స్వామి, అమ్మవారికి పూజారులు ఈశ్వరప్ప, మల్లికార్జున ప్రత్యేక అలంకరణ చేశారు. పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు స్వామి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. మహాశివరాత్రిని తలపించే విధంగా సుదూరప్రాంతాలు కర్ణాటక, సత్యసాయి, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు మల్లయ్యకొండను సందర్శించి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ మునిరాజ, కొండకిట్టల ఆధ్వర్యంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. కళాకారుల బృందాలు పలు రకాల భజనలు, కోలాటలతో భక్తులను అలరింపజేశారు. దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు అన్నసంతర్పణ చేశారు.
ఏనుగుమల్లమ్మకు ప్రత్యేక అలంకరణ
మల్లయ్యకొండకు వెళ్లే మార్గంమధ్యలో వెలసిన శ్రీ ఏనుగుమల్లమ్మ ఆలయంలో అమ్మవారికి పూజారులు విజయకుమారి, శేఖర్ ప్రత్యేక అలంకరణ చేశారు. పూజలు, అభిషేకాలు చేశారు. భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. మహిళా భక్తులు అమ్మవారికి పూజలతో మొక్కులు తీర్చుకున్నారు.

భ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామికి విశేష పూజలు