
ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం
నందలూరు : ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి.అశోక్‌బాబు అన్నారు. సోమవారం నందలూరుకు చేరుకున్న రాజ్యాంగ పరిరక్షణ యాత్రకు దళిత నాయకులు స్వాగతం పలికారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో అశోక్‌బాబును ఘనంగా సత్కరించారు. అనంతరం అశోక్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలు అన్ని విధాలుగా నష్టపోతారన్నారు. కొందరి మాయమాటల మోజులో పడి కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ చేయడం అన్యాయం అన్నారు. దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసమే ఈ యాత్ర చేపట్టామన్నారు. మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగం సంజీవ్ మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ యాత్రకు అనూహ్య స్పందన వస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మోడపోతుల రాము, ఆర్ముగం విశ్వనాథ్, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యులు పెనుబాల నాగసుబ్బయ్య, కాకి చంద్ర, నాయనపల్లి ఆదినారాయణ, తుమ్మది శివకుమార్, గుడిష సుబ్రమణ్యం, ఎముక దుర్గయ్య, శివనరసింహులు, సురేష్, నాగభూషణం, నాగరాజు, డిస్కో మని తదితరులు పాల్గొన్నారు.