
స్థలం విషయంలో ఘర్షణ
మదనపల్లె రూరల్ : స్థల విషయంలో జరిగిన ఘర్షణలో అక్క, తమ్ముడు గాయపడిన సంఘటన పట్టణంలో ఆదివారం జరిగింది. టీచర్స్ కాలనీకి చెందిన చిన్నప్ప కుమారుడు శివశంకర్(37) స్థానికం వారపుసంతలో కూరగాయల మండీ నిర్వహిస్తున్నాడు. ఇసుకనూతిపల్లెకు చెందిన అతడి అక్క ఇ.మంజుల(40) కొత్తిమీర వ్యాపారం చేస్తోంది. కొంతకాలంగా శివశంకర్, వారపుసంతలో మండీ నిర్వహిస్తున్న సయ్యద్ షావలి మధ్య స్థలం వివాదం ఉంది. ఆదివారం సయ్యద్ షావతి తన వద్ద పనిచేస్తున్న ఈశ్వరమ్మ కాలనీకి చెందిన యువకుడిని ప్రోత్సహించి శివశంకర్‌పై దాడికి ఉసి గొల్పాడు. దీంతో ఆ యువకుడు కొంతమందితో కలిసి శివశంకర్‌పై ఇనుపరాడ్‌తో దాడి చేస్తుండగా, అడ్డువచ్చిన అతడి సోదరి మంజులపై సైతం దాడిచేశాడు. దాడిలో అక్క, తమ్ముడు గాయపడగా, స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై బాధితుడు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయగా, విచారణ చేస్తున్నారు.