
సంప్రదాయాలకు నెలవు
● తరతరాలుగా కొనసాగుతున్న
సంప్రదాయం
● పురాణేతిహాసాల్లో ఘట్టాలను
వివరిస్తున్న వైనం
బొమ్మల కొలువు కేవలం సరదా కాదు..
ఆ కొలువు మన సంప్రదాయాలకు నెలవు. వందల ఏళ్లుగా ఆ కొలువు నిర్వహిస్తున్న వారికి ఈ విషయం తెలిసి ఉంటుంది.
ముందుతరం వారు ఏర్పాటుచేసిన బొమ్మల కొలువును జాగ్రత్తగా కాపాడుకుంటూ
మన బొమ్మలను జతచేస్తూ..
తరం మారుతున్న కొద్దీ కొలువును మరింత అందంగా తయారు చేస్తారు.
పాతకాలం నాటి బొమ్మలు
నాటి కథాకాలక్షేపాలకు ఆచార వ్యవహారాలకు సాక్షిగా ఉంటాయి.
మదనపల్లె సిటీ : దసరా అంటేనే సందడి. సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇందులో బొమ్మల కొలువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. యువతకు బొమ్మల కొలువు అంటే కొత్తమాటలా అనిపిస్తున్నా నేటికీ కొన్ని కుటుంబాలు కొలువులు ఏర్పాటు చేస్తూ తరతరాల సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి. దసరా ఉత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు ఇళ్లల్లో బొమ్మల కొలువులు ఏర్పాటుచేస్తారు. ఇంట్లో ప్రత్యేక గదిని కేటాయించి బొమ్మలు పేర్చడం కష్టంతో కూడుకున్న పనే అయినప్పటికీ ఇష్టంగా చేస్తుంటారు. తొమ్మిదిమెట్లు ఏర్పాటు చేసి సంప్రదాయబద్ధంగా కొలువుదీర్చుతారు. మట్టి కొయ్య, పింగాణి, ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్ బొమ్మలు ఆకర్షణగా నిలుస్తాయి.
భద్రపరచడం కష్టమే..
బొమ్మల కొలువు పూర్తయ్యాక వాటిని భద్రపడం కీలకమని చెబుతున్నారు నిర్వాహకులు. దీనికి ఎంతో ఓపిక, సహనం ఉండాలంటున్నారు. మళ్లీ బొమ్మల కొలువు వచ్చే వరకు వాటి రంగులు ఊడిపోకుండా వాటిని జాగ్రత్తగా పెట్టెల్లో కాపాడుకుంటామని వారు వివరించారు. దుర్గాదేవితో పాటు రాముడు, కృష్ణుడు, వినాయకుడు, లక్ష్మి, సరస్వతీ, పెళ్లితంతు, జంతువులు, పక్షులు, పండ్లు, చెట్లు, ఆకులు,పురాతన కట్టడాలు, ప్రయాణ సాధనాలు, వాహనాల.. ఇలా రకరకాల బొమ్మలు ఈ కొలువులో కనువిందు చేస్తుంటాయి. వాటిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.